సమాజంలో ప్రాణాలను కాపాడే వైద్య సిబ్బంది రక్షణ నిత్యం ప్రశ్నార్థకంగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సుపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.
సురేంద్రనగర్ జిల్లా లింబ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న 26 ఏళ్ల నర్సు ఉన్నతిబెన్ కనుభాయ్ సోలంకి తన ఫోన్ మాట్లాడుతున్న సమయంలో.. దివ్యరాజ్సింగ్ గజేంద్రసింగ్ రాణా అనే వ్యక్తి అత్యవసర చికిత్స విభాగం (ICU) వద్దకు వచ్చి వీరంగం సృష్టించాడు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ ఉన్నారంటూ ఆగ్రహంతో కేకలు వేస్తూ గొడవకు దిగాడు. శాంతంగా మాట్లాడాలని చెప్పిన ఆ మహిళా నర్సుపై ఉన్నట్టుండి దాడికి దిగి చెంప చెల్లుమనిపించాడు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి గురైన నర్సు వెంటనే ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీసి ఇతర సిబ్బందిని ఆశ్రయించింది.
ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు లింబ్డి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దివ్యరాజ్సింగ్ రాణాను వెంటనే అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పించినట్లు తెలిసింది. రాత్రి వేళల్లో తక్కువ సిబ్బందితో విధులు నిర్వర్తించే వైద్య ఉద్యోగులకు సరైన భద్రత లేదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి తేటతెల్లం చేసింది.

Leave a Reply