రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు అత్యంత వేగంగా వస్తూ, మలుపు వద్ద ఊహించని రీతిలో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వారిని హేమంత్, ఆదిత్యలుగా గుర్తించారు. 20 ఏళ్ల హేమంత్ పిలానీలోని తన ఇంటి వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో, పిలానీలోని ఒక విద్యాసంస్థలో చదువుతున్న 21 ఏళ్ల ఆదిత్య పెట్రోల్ పోయించుకోవడానికి ఆ మార్గంలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇద్దరి వాహనాలు ముఖాముఖి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బైకులు ఢీకొన్న వేగానికి ఇద్దరు యువకులు గాల్లోకి లేచి రోడ్డుపై బలంగా పడిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి సమయం కావడంతో ఒకరినొకరు సరిగ్గా గమనించుకోలేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరికీ ప్రాథమిక సాయం అందించారు.
అనంతరం క్షతగాత్రులిద్దరినీ అంబులెన్స్ ద్వారా పిలానీలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply