“అర్ధరాత్రి 2 గంటలకు దద్దరిల్లిన హాస్టల్!” — విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ వాట్సాప్‌లో పుకార్లు.. భగ్గుమన్న క్యాంపస్, విధ్వంసం సృష్టించిన విద్యార్థులు.. పోలీసుల కీలక వివరణ!

పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో (LPU) ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్లతో, విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడి అర్ధరాత్రి చేపట్టిన తీవ్ర ఆందోళనతో యూనివర్సిటీ ప్రాంగణం రణరంగంగా మారింది.

శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాస్టల్ వద్దకు చేరుకున్న వేలాది మంది విద్యార్థులు.. యూనివర్సిటీ భవనాలను ధ్వంసం చేసి, ఫర్నిచర్‌కు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రధాన గేట్లు, కిటికీల అద్దాలు, వాహనాలను పగలగొట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అనంతరం విద్యార్థులు క్యాంపస్ బయటకు వచ్చి లూథియానా – జలంధర్ జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయి, వాహనాలు బారులు తీరాయి.

సమాచారం అందుకున్న కపుర్తలా ఎస్పీ గౌరవ్ తూరా నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సహాయంతో విద్యార్థులను అదుపులోకి తెచ్చి హైవేపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు.

కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు వదంతులు వ్యాప్తి చేశారని పోలీసులు, యూనివర్సిటీ యాజమాన్యం తెలిపాయి. క్యాంపస్‌లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *