అలర్ట్: మహిళలు తప్పక చదవాలి : యోని (Vagina) ఆరోగ్యం గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్య విషయాలు!

చాలామంది మహిళలు తమ సౌందర్యం, చర్మ సంరక్షణ మరియు ఫిట్‌నెస్ మీద చూపే శ్రద్ధను వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene) మీద చూపరు. ఇది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. ముంబైలోని ఎయిమ్స్ (AIMS) ఆస్పత్రికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దీపాలి లోధ్ మహిళల జననేంద్రియ ఆరోగ్యానికి సంబంధించి వివరించిన 10 సూత్రాలు ఇక్కడ ఉన్నాయి:

1. శరీరపు సహజ శుభ్రత వ్యవస్థ: యోని తనను తాను శుభ్రం చేసుకోగల (Self-cleaning organ) అంగం. లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి సోపులు, కెమికల్ వాష్‌లు అస్సలు వాడకూడదు. కేవలం వెలుపలి భాగాన్ని (వల్వా) శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీరు సరిపోతుంది. కెమికల్స్ వాడితే అక్కడి pH సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

2. కాటన్ లోదుస్తులు (Cotton Underwear): నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు వాడటం వల్ల గాలి ఆడక తేమ, వేడి పేరుకుపోతాయి. ఇది బ్యాక్టీరియా, ఈస్ట్ పెరగడానికి కారణమవుతుంది. ఎల్లప్పుడూ కాటన్ లోదుస్తులనే వాడాలి, ఇవి ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.

3. స్రావాల గురించి ఆందోళన వద్దు: తెల్లబట్ట (White discharge) అనేది చాలా సాధారణమైన మరియు ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఇది యోనిని శుభ్రంగా ఉంచడానికి శరీరం చేసే ప్రయత్నం. అయితే, ఈ స్రావం పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారినా, దుర్వాసన వచ్చినా, దురద లేదా మంట ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

4. ‘ముందు నుండి వెనుకకు’ శుభ్రం చేయండి: మరుగుదొడ్డికి వెళ్ళిన తర్వాత ఎల్లప్పుడూ ముందు నుండి (యోని) వెనుక వైపుకు (గుదద్వారం) తుడుచుకోవాలి. వెనుక నుండి ముందుకు తుడవడం వల్ల మలద్వారం దగ్గరి బ్యాక్టీరియా యోనిలోకి ప్రవేశించి యూరినరీ ఇన్ఫెక్షన్లు (UTI) వచ్చే అవకాశం ఉంది.

5. వార్షిక తప్యాసన తప్పనిసరి: ఏటా కనీసం ఒకసారి గైనకాలజిస్ట్ చేత శారీరక పరీక్ష మరియు ప్యాప్ స్మియర్ (Pap Smear) వంటి పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను తొలి దశలోనే గుర్తించవచ్చు.

6. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండండి: మార్కెట్లో దొరికే పరిమళభరితమైన ప్యాడ్లు, స్ప్రేలు, సెంట్లు కలిగిన వాష్‌లు వాడకండి. వీటిలోని రసాయనాలు సున్నితమైన చర్మాన్ని పాడు చేస్తాయి.

7. రుతుచక్రం (Periods) ట్రాకింగ్: మీ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి? ఎన్ని రోజులు ఉంటాయి? అనేవి గమనించాలి. రక్తస్రావం అతిగా అయినా లేదా సమయం తప్పి వచ్చినా వెంటనే గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.

8. అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు: మూత్ర విసర్జన సమయంలో మంట, నిరంతర దురద లేదా నొప్పి సాధారణం కాదు. “తగ్గిపోతుందిలే” అని సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులను సంప్రదించాలి. ఇవి బ్యాక్టీరియల్ వాజినోసిస్ వంటి సమస్యలు కావచ్చు.

9. ఆహారం మరియు నీరు: మంచి ఆహారం యోని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 12-15 గ్లాసుల నీరు తాగాలి. మీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పెరుగు (Probiotics) చేర్చుకోవడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా సమతుల్యంగా ఉంటుంది.

10. సురక్షిత శృంగారం: కాండమ్స్ కేవలం గర్భధారణను నివారించడానికి మాత్రమే కాదు. ఇవి లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STIs) నుండి రక్షణ కల్పిస్తాయి.


Posted

in

by

Tags: