‘అలెగ్జాండర్ వచ్చాడు, మంగోలులు వచ్చారు.. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. కాలమే ఏమీ చేయలేనిది, ఒక పిచ్చివాడు ఏం చేస్తాడు?’; అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్

టెహ్రాన్: ఇరాన్ ఉనికిని తుడిచిపెట్టేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. “ఈ రాత్రితో ఒక పూర్తి నాగరికత అంతమైపోతుంది” అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవకపోతే ఇరాన్ తలరాతను మారుస్తామని, విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా అత్యంత కఠినంగా స్పందించింది. తాము ఎవరి ఒత్తిడికీ లొంగబోమని స్పష్టం చేసింది. టర్కీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్రంప్‌కు కౌంటర్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టింది: “అలెగ్జాండర్ దీనిని తగులబెట్టాడు, మంగోలులు దీనిని నాశనం చేశారు. చరిత్ర మమ్మల్ని చాలాసార్లు పరీక్షించింది, కానీ ఇరాన్ నేటికీ అలాగే నిలబడి ఉంది.” ట్రంప్‌ను నేరుగా ‘సన్కీ’ (పిచ్చివాడు) అని సంబోధిస్తూ—కాలం కూడా తుడిచిపెట్టలేని నాగరికతను ఒక వ్యక్తి బెదిరింపులు ఏమీ చేయలేవని పేర్కొంది.

అమెరికాతో చర్చలు ఎందుకు నిలిపివేసింది? ట్రంప్ దూకుడు వైఖరి తర్వాత, అమెరికాతో జరుగుతున్న అన్ని రకాల పరోక్ష చర్చలను, ‘బ్యాక్ ఛానల్ డిప్లొమసీ’ని ఇరాన్ రద్దు చేసుకుంది. కేవలం ‘డొల్ల వాగ్దానాల’ కోసం తాము వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ స్పష్టం చేసింది. కేవలం కాల్పుల విరమణ (Ceasefire) మాత్రమే కాదు, యుద్ధం పూర్తిగా ముగియాలని, దానికి పక్కా గ్యారంటీ కావాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

ట్రంప్ డెడ్ లైన్ – వినాశనం తప్పదా? మంగళవారం అర్ధరాత్రి వరకు ట్రంప్ ఇరాన్‌కు సమయం ఇచ్చారు. ఇరాన్ వినకపోతే అక్కడి ప్రతి వంతెనను, పవర్ ప్లాంట్‌ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకోవడం ‘యుద్ధ నేరం’ (War Crime) కిందకు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఇరాన్‌కు చెందిన కీలకమైన ‘ఖర్గ్ ఐలాండ్’ (Kharg Island) చమురు టెర్మినల్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇప్పటికే బాంబుల వర్షం కురిపిస్తున్నాయని ఇరాన్ పేర్కొంది.


Posted

in

by

Tags: