ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా అజగైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో, అనారోగ్యంతో ఉన్న తన భర్తను ఒంటరిగా వదిలేసి, సొంత కూతురి భర్త (అల్లుడి)తో అత్త ఉడాయించిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
అంతేకాకుండా, ఇంట్లో నేల కింద పాతిపెట్టిన లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను కూడా ఆమె తవ్వి తీసుకెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ఆరోపిస్తున్నారు.
బాధిత కుమారుడు, అనారోగ్యానికి గురైన అతని తండ్రి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జయప్రకాష్ సింగ్కు స్వయంగా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెలుగులోకి వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.. సుమారు 15 ఏళ్ల క్రితం సోహరామౌ పోలీస్ పరిధిలో కూతురికి వివాహం చేశారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఆ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ, ఆ ఘటన తర్వాత అత్త, అల్లుడి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
అల్లుడితో ఉన్న ఈ సంబంధాన్ని భర్త మందలించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకోవాల్సిన వృద్ధ భార్య.. తన మాజీ అల్లుడితో అకస్మాత్తుగా ఇంటి నుంచి పారిపోయింది. వెళ్లే ముందు, గత ఏడాది సెప్టెంబర్ 14న భర్త కొన్న భూమిని తన మనవడి పేరు మీద రాయించినట్లు కూడా తెలిసింది.
అంతేకాకుండా, ఇంటి నేల కింద గొయ్యి తవ్వి భద్రంగా పాతిపెట్టిన సుమారు 2 కిలోల వెండి, 80 గ్రాముల బంగారంతో సహా లక్షల రూపాయల విలువైన వంశపారంపర్య ఆభరణాలను కూడా ఆ మహిళ తవ్వి తీసుకెళ్లిపోయింది. గ్రామంలో కాపలాదారుగా పనిచేస్తున్న తన తండ్రిని ఒంటరిగా వదిలేసి వెళ్లిన తల్లిపై, ఆ అల్లుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అజగైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో, తాజాగా వారు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న ఎస్పీ తగిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply