ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినయ్ కుమార్ గుప్తా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆగస్టు 21న పిల్లలకు మందు రాయడం విషయమై వినయ్, ఆయన భార్య రేఖ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన రేఖ, కొద్దిసేపటికే తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి వినయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారని అతని తల్లి ఆరోపించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వినయ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
వినయ్ తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు నెలల క్రితం కోడలి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి “మా అల్లుళ్లను మేం చంపేస్తాం” అంటూ నేరుగా బెదిరించారు. ఆ సమయంలో కోపంలో అన్న మాటలుగానే తాము తేలిగ్గా తీసుకున్నామని, ఆ మాటలే ఒకరోజు ఇంతటి ఘోరానికి దారితీస్తాయని ఊహించలేకపోయామని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. వినయ్ దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని, తన వైవాహిక జీవితంపై కుమారుడు తరచూ బాధపడుతుండేవాడని ఆమె పేర్కొన్నారు.
ఘటన జరిగిన రోజు రేఖ తన సోదరులు, బంధువులతో కలిసి ఇంటికి వచ్చి వినయ్‌తో ఘర్షణకు దిగి భౌతిక దాడికి పాల్పడ్డారని తల్లి ఫిర్యాదు చేశారు. వినయ్ పరిస్థితి విషమించడంతో స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.
ఈ కేసులో ఇంట్లోని నిఘా కెమెరాల అంశం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే ఇంట్లోని సీసీటీవీ (CCTV) కెమెరాలను ఆఫ్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ భార్య రేఖ, ఆమె ఇద్దరు సోదరులు, వదిన సహా నలుగురిని అరెస్ట్ చేశారు. ఇంట్లో అసలేం జరిగింది? వినయ్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply