రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ వృద్ధుడిది. వయసు మీదపడినా, శారీరక వైకల్యం ఉన్నా ఎవరి ముందూ చేయి చాచకుండా మిఠాయిలు అమ్ముకుంటూ గౌరవంగా జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా వదలకుండా అతడి బ్యాగును దొంగిలించుకుపోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది.
మానవత్వం, కనీస కనికరం లేకుండా ఓ వ్యక్తి చేసిన ఈ దారుణం సమాజం మనసాక్షిని ప్రశ్నించేలా చేస్తోంది.
ఈ ఘటన ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రధాన కూడలి వద్ద ఓ దివ్యాంగ వృద్ధుడు మిఠాయిలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎవరి మీదా ఆధారపడకుండా తన కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. అయితే, ఓ దుండగుడు అకస్మాత్తుగా అతడి వద్దకు వచ్చి, తన దగ్గర ఉన్న బ్యాగును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆ బ్యాగులోనే తన రోజువారీ జీవనానికి అవసరమైన వస్తువులు, సంపాదనకు సంబంధించిన సామగ్రి ఉండటంతో ఆ వృద్ధుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కళ్లముందే బ్యాగును దోచుకెళ్లడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయాడు.
ఇప్పటికే వయసు మీదపడటంతో పాటు శారీరక వైకల్యంతో జీవనం సాగించడమే కష్టంగా ఉన్న ఆ వృద్ధుడి పట్ల ఇంతటి అమానవీయంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పనిచేసి గౌరవంగా బతకాలనుకునే ఓ వృద్ధుడి పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం? కనీస మానవత్వం కూడా లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
