లండన్: పని చేసే చోట తోటి ఉద్యోగుల పట్ల గౌరవంగా ప్రవర్తించకపోతే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో ఈ ఘటన నిరూపిస్తోంది. బ్రిటన్లో పనిచేస్తున్న ఒక భారత సంతతి నర్సును పదే పదే ‘ఆంటీ’ అని పిలిచినందుకు గాను, అక్కడి న్యాయస్థానం నిందితుడికి కళ్లు బైర్లు కమ్మే జరిమానా విధించింది. కార్యాలయాల్లో క్రమశిక్షణ, మర్యాద ఎంత ముఖ్యమో చాటిచెబుతూ వెలువడిన ఈ తీర్పు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
భారత సంతతికి చెందిన 61 ఏళ్ల ఇల్డా ఎస్టీవ్స్ బ్రిటన్లోని ప్రభుత్వ ఆరోగ్య శాఖలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెతో పాటు ఘనా దేశానికి చెందిన మరో నర్సు కూడా పని చేస్తోంది. అయితే, సదరు సహోద్యోగి ఇల్డాను విధుల్లో ఉండగా అందరి ముందూ ‘ఆంటీ.. ఆంటీ’ అని పిలిచేది. దీనిపై ఇల్డా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “నేను నీకంటే వయసులో, అనుభవంలో పెద్దదాన్ని.. నన్ను మేడం అని పిలువు లేదా పేరుతో పిలువు.. అంతేగానీ ఇలా ‘ఆంటీ’ అని పిలవద్దు” అని స్పష్టంగా చెప్పారు.
వినకపోతే కోర్టుకే!
ఎన్నిసార్లు వారించినా సదరు ఘనా దేశపు నర్సు తన ప్రవర్తన మార్చుకోలేదు. పైగా వెటకారంగా మళ్ళీ మళ్ళీ ‘ఆంటీ’ అంటూనే ఉంది. విసిగిపోయిన ఇల్డా, చివరకు ఈ అవమానంపై న్యాయపోరాటానికి దిగారు. పని ప్రదేశం అనేది మర్యాదకు నిలయమని, అక్కడ వయసును ఎగతాళి చేసేలా ‘ఆంటీ, అంకుల్, తాత, అమ్మమ్మ’ అని పిలవడం వృత్తి ధర్మానికి విరుద్ధమని ఆమె కోర్టులో వాదించారు.
రూ. 1.75 కోట్ల భారీ జరిమానా!
గత రెండేళ్లుగా సాగిన ఈ విచారణలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పని ప్రదేశంలో గౌరవం అనేది అతి ముఖ్యమని, ఉద్దేశపూర్వకంగా ఇల్డాను అగౌరవపరిచినందుకు గాను సదరు నర్సుకు ఏకంగా రూ. 1.75 కోట్ల (సుమారు 1.66 లక్షల పౌండ్లు) భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
అప్పీలు చేసినా దక్కని ఊరట!
కేవలం ‘ఆంటీ’ అని పిలిచినందుకే ఇంత జరిమానా విధిస్తారా అని నిందితురాలు పైకోర్టులో అప్పీలు చేశారు. కానీ, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆ జరిమానా మొత్తాన్ని పూర్తిగా ఇల్డాకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
వృత్తిపరమైన గౌరవాన్ని కాపాడటంలో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ దేశంలోనైనా సరే, తోటి ఉద్యోగుల ఆత్మగౌరవంతో ఆడుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ కేసు మరోసారి హెచ్చరించింది.
