మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దీపావళి రోజున ఉపాధ్యాయ దంపతులు విగతజీవులుగా కనిపించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
మనీష్ కణ్వీర్ (38), ఆయన భార్య సోనాలి కణ్వీర్ (35) ఇద్దరూ ఒకే ఇంట్లో శవమై కనిపించారు. వీరిద్దరూ గడ్చిరోలి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
ఈ దంపతులకు గత ఆగస్టు 31న వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం అని తెలుస్తోంది. దీపావళి సెలవులను జరుపుకునేందుకు ఇద్దరూ నాగ్‌పూర్‌లోని తమ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లడంతో ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.
నవంబర్ 8వ తేదీ ఉదయం ఓ బంధువు వారిని పలకరించేందుకు ఇంటికి వెళ్లాడు. ఎంతసేపు తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా.. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అసలు వీరిద్దరూ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, కుటుంబ నేపథ్యంతో సహా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన మూడు నెలలకే దీపావళి రోజున జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Leave a Reply