వాషింగ్టన్: ఇరాన్‌లోని ఇంధన ప్లాంట్లు సహా ఇతర కీలక వ్యవస్థలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమ నగరమైన కరాజ్‌తో అనుసంధానించే కీలకమైన వంతెనను దాడిలో ధ్వంసం చేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.
మధ్యప్రాచ్యంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడే 136 మీటర్ల ఎత్తు గల ఈ వంతెనను అమెరికా-ఇజ్రాయెల్ దళాలు కలిసి ధ్వంసం చేశాయి.
టెహ్రాన్‌తో చర్చలు విఫలమైతే భారీ మూల్యం టెహ్రాన్‌తో చర్చలు విఫలమైతే విద్యుత్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. “ఇరాన్లో మిగిలి ఉన్న వాటిని నాశనం చేయడం అమెరికా సైన్యం ఇంకా ప్రారంభించనే లేదు” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో రాశారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఒప్పందం చేసుకోకపోతే అంతే! “ఇప్పుడు వంతెన.. తర్వాత విద్యుత్ కేంద్రాలు! ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికాది. ఇరాన్ కొత్త ప్రభుత్వం ఏం చేయాలో వారికి తెలుసు, అది త్వరగా చేయాలి! సమయం మించిపోకముందే ఒక ఒప్పందానికి రండి” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌లోని వంతెన ధ్వంసమైన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
