QR కోడ్ ద్వారా పేమెంట్ చేయడం మనందరికీ సురక్షితమైన పద్ధతిగా అనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ఆవిష్కరణతో పాటు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. యూపీఐ (UPI) సురక్షితమైనదే అయినప్పటికీ, మోసగాళ్లు అమాయక కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేశారు క్రియేటర్ సంకేత్ ప్రకాష్ (@spiktec_).
ఏమిటా స్కామ్? వైరల్ వీడియోలోని కథనం ప్రకారం.. ఒక వ్యక్తి ఆటో దిగాక డ్రైవర్‌కు 150 రూపాయలు చెల్లించడానికి QR కోడ్ స్కాన్ చేస్తాడు. కానీ అతని ఖాతా నుండి ఏకంగా 15,000 రూపాయలు కట్ అవుతాయి. అసలు ఇది ఎలా జరుగుతుందంటే, మనం స్కాన్ చేసే కొన్ని QR కోడ్లు కేవలం పేమెంట్ తీసుకోవడానికే కాదు, ‘పేమెంట్ రిక్వెస్ట్’ (Payment Request) పంపడానికి కూడా రూపొందించబడతాయి.
ఎలా జాగ్రత్త పడాలి? మీరు స్కాన్ చేసినప్పుడు స్క్రీన్‌పై ‘Collect Request’, ‘Pay Request’ లేదా ‘Approve Request’ అని కనిపిస్తే వెంటనే దాన్ని నిరాకరించాలి (Decline). కూరగాయల వారు, ఆటో డ్రైవర్లు లేదా డెలివరీ బాయ్స్ మిమ్మల్ని “త్వరగా పేమెంట్ చేయండి” అని ఒత్తిడి చేస్తున్నారంటే అక్కడ ఏదో మోసం జరిగే అవకాశం ఉందని గుర్తించాలి.
వీడియోలోని లోపాలు – నెటిజన్ల విమర్శలు: ఈ వీడియో అవగాహన కల్పించేలా ఉన్నప్పటికీ, సాంకేతికంగా కొన్ని తప్పులు ఉన్నాయని నెటిజన్లు వేలెత్తి చూపుతున్నారు:
- ఆటో డ్రైవర్ చూపించిన QR కోడ్‌లో ఎక్కడా ‘పేమెంట్ రిక్వెస్ట్’ అని రాసి లేదు.
- యూపీఐ యాప్‌లో మనం పిన్ (PIN) ఎంటర్ చేసే ముందు ఎంత మొత్తం కట్ అవుతుందో స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.
- వీడియోలో స్క్రీన్‌పై 150 రూపాయలే కనిపిస్తున్నా, 15,000 కట్ అయినట్లు చూపించడంపై యూజర్లు పెదవి విరుస్తున్నారు.
అయినప్పటికీ, తొందరపాటులో ఉన్నప్పుడు ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందని క్రియేటర్ హెచ్చరిస్తున్నారు.
