ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉదంతం: ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ‘రోనిషా సట్టి’ అనే యువతి, రెండు ఎమోషనల్ వీడియోలను పోస్ట్ చేసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తన ఆత్మహత్యాయత్నానికి తన నిశ్చితార్థం జరిగిన ప్రశాంత్ శర్మ, అతని కుటుంబ సభ్యులే కారణమని ఆమె ఆరోపించింది.
బాధితురాలి తల్లి ఆరోపణలు: ప్రశాంత్ తన కూతురిపై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి, అసభ్యకరమైన పోస్టులతో తమ కుటుంబాన్ని అవమానించాడని రోనిషా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కుట్టుపని, ఆటో నడుపుకుంటూ ఎంతో కష్టపడి పెంచిన తమను, ప్రశాంత్ రూ. 10 లక్షల వరకు నగదు తీసుకుని మోసం చేశాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
లాయర్ సంచలన వాదనలు: అయితే, ఈ ఆరోపణలను ప్రశాంత్ శర్మ తరపు న్యాయవాది పూర్తిగా ఖండించారు. 2024 నవంబర్లో వారికి నిశ్చితార్థం జరిగిందని, ఆ యువతికి ఇదివరకే వివాహమైందని, అయితే విడాకులు తీసుకున్నానని తమను నమ్మించిందని ఆయన పేర్కొన్నారు. తమ సంబంధం కొనసాగుతున్న సమయంలో, ఆమె విలాసవంతమైన షాపింగ్, దుబాయ్ ట్రిప్పుల కోసం ప్రశాంత్ నగలు మరియు UPI ద్వారా రూ. 9.5 లక్షల వరకు పంపించాడని ఆధారాలతో సహా వివరించారు. ఆ తర్వాత ఆ యువతి పెళ్లిని వాయిదా వేస్తూ, తన కోరికలు తీరాయని, ఇక పెళ్లి చేసుకోనని చెప్పిందని లాయర్ తెలిపారు.
నిజం బయటపడటంతో..: దీనిపై అనుమానం వచ్చి ప్రశాంత్ కోర్టును ఆశ్రయించగా, ఆ యువతికి తన మొదటి భర్త నుండి ఇంకా అధికారికంగా విడాకులు రాలేదనే షాకింగ్ నిజం తెలిసింది. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు ఆ యువతి మరియు ఆమె కుటుంబ సభ్యులపై ఇప్పటికే పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, ఆత్మహత్యాయత్నం దేనికీ పరిష్కారం కాదని, చట్టపరంగానే పోరాడాల్సిందని ప్రశాంత్ తరపు లాయర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ యువతి జమ్ములోని ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతోంది.
