ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షి తాలూకా హతీజ్ గ్రామంలో షేర్ మార్కెట్ లో సంభవించిన భారీ నష్టాల కారణంగా.. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘోర ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
యోగేష్ బాలాసాహెబ్ పాటిల్ అనే సదరు ఉపాధ్యాయుడు, షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తూ సుమారు 1.80 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఈ భారీ నష్టాన్ని భర్తీ చేయడానికి, అలాగే అప్పులను తీర్చడానికి తన బంధువులతో పాటు వివిధ మార్గాల ద్వారా ఆయన తీసుకున్న అప్పులు.. చివరకు ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. దీంతో, వేసవి సెలవులబ కోసం తన సొంత ఊరికి వచ్చిన ఆయన, అప్పుల ఊబి నుండి బయటపడలేక ఈ దారుణమైన విపరీత నిర్ణయం తీసుకున్నారు.
భార్యాపిల్లలకు విషమిచ్చి.. గురువారం అర్ధరాత్రి వేళ, యోగేష్ పాటిల్ తన భార్య మాధురి, కుమారులు అథర్వ మరియు శివాన్ష్‌లకు అన్నంలో విషం కలిపి ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చి చూసినప్పుడు ఈ ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న వైరాగ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మరణించిన నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, యోగేష్ పాటిల్ ఆత్మహత్యకు ముందు రాసిన 22 పేజీల సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన లేఖను (Suicide Note) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తనకు ఎదురైన ఆర్థిక నష్టాలు, అప్పుల వివరాల గురించి ఆయన అత్యంత సవివరంగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply