“ఆఫీసులో భోజనం, స్నాక్స్, 8 బ్రేక్‌లతో జాలీ లైఫా.? మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల పాత వీడియోలతో చెలరేగుతున్న చర్చ.!!”

ప్రపంచ అగ్రగామి టెక్ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఆఫీసులో రకరకాల వంటకాలు, స్నాక్స్, విశ్రాంతి సదుపాయాలతో ఉద్యోగులు తమ దైనందిన జీవితాన్ని పంచుకున్న వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, సంస్థలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వీడియోలు మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.

మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నామని చెప్పుకునే పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, తమ ఆఫీసు అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్పట్లోనే పంచుకున్నారు. “ఒక మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ ఒక రోజు జీవితం”, “మైక్రోసాఫ్ట్ ఆఫీసులో నేను ఏం తింటాను?” లాంటి శీర్షికలతో వచ్చిన ఈ వీడియోల్లో.. ఆఫీసులో భోజనం, పని వాతావరణం, ఉద్యోగులకు లభించే సదుపాయాలను చూపించారు.

ఈ వీడియోలు మళ్లీ వైరల్ కావడంతో, బడా టెక్ కంపెనీల్లో పనిచేసే వారి జీవనశైలి, ఆఫీసు సదుపాయాలు, ఉద్యోగ భద్రత గురించి నెటిజన్లు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. కొందరు ఆఫీసులో లభించే సౌకర్యాలను ఎత్తిచూపుతూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా, పనివేళల్లో పలుమార్లు (బ్రేక్‌లు) విరామాలు తీసుకుంటున్నట్లు ఉన్న వీడియోలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే సమయంలో, మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం (Voluntary Exit Offer – VEO) వార్తలు కూడా ఈ చర్చలో భాగమయ్యాయి. సుమారు 60,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నారనే వార్తలతో ఈ పాత వీడియోలను నెటిజన్లు ముడిపెడుతున్నారు. అయితే, పాత వీడియోలు వైరల్ కావడం, ఉద్యోగుల బ్రేక్‌ల గురించి నెటిజన్ల విమర్శలు మాత్రమే సిబ్బంది కోతకు అసలు కారణమని నిర్ధారించలేము.


Posted

in

by

Tags: