ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉత్తర ప్రావిన్స్ అయిన బాల్ఖ్ ప్రాంతంలో, వైద్యుల ప్రిస్క్రిప్షన్లు మరియు ఆసుపత్రి రికార్డులతో సహా ప్రభుత్వ పత్రాలలో మహిళల పేర్లను ఉపయోగించడంపై తాలిబాన్ అధికారులు నిషేధం విధించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఆఫ్ఘన్ మీడియా సంస్థ ‘జాన్ టైమ్స్’ మరియు బ్రిటిష్ దినపత్రిక ‘ది గార్డియన్’ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ షాకింగ్ విషయం బయటపడింది. దీని ప్రకారం, వైద్య సిబ్బంది మరియు ప్రభుత్వ ఉద్యోగులు మహిళలను వారి అసలు పేర్లతో పిలవడానికి బదులుగా, సాధారణంగా ‘బామ్మ’ లేదా ‘వృద్ధురాలు’ అనే అర్థంలో వాడే ‘బీబీ’ (Bibi) అనే పదంతో మాత్రమే పిలవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మహిళల వ్యక్తిగత గుర్తింపును తుడిచిపెట్టే మరొక ప్రయత్నంగానే ఈ చర్యను సామాజిక కార్యకర్తలు చూస్తున్నారు. జర్మనీలో నివసిస్తున్న ఆఫ్ఘన్ హక్కుల కార్యకర్త లాలా ఉస్మానీ దీనిపై స్పందిస్తూ.. పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందని, కొన్ని చోట్ల మహిళలను మేకలు, ఆవులు వంటి జంతువుల పేర్లతో పోలుస్తూ అవమానకరంగా పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ పేరును లాక్కోవడం అంటే ఆమె వ్యక్తిత్వాన్ని నాశనం చేసి, ఆమెను మరొకరి ఆస్తిగా మార్చే ప్రయత్నమేనని ఆమె మండిపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికే మహిళలను ఫలానా వారి భార్య లేదా కుమార్తెగానే గుర్తించడం, చివరికి సమాధులపై కూడా వారి పేర్లు లేకుండా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుతం బాల్ఖ్ ప్రావిన్స్‌లో మాత్రమే ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా విస్తరించవచ్చని మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా స్థానిక స్థాయిలో విధించిన ఆంక్షలే తర్వాత జాతీయ స్థాయి నిషేధాలుగా మారాయని ‘ఫెమెనా’ (Femena) సంస్థ డైరెక్టర్ జుబైదా అక్బర్ హెచ్చరించారు. 12 ఏళ్లు పైబడిన బాలికలకు విద్య నిరాకరణ, ఉద్యోగాలపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటంపై ఆంక్షలు ఇలా ఇప్పటికే మహిళల హక్కులను కాలరాస్తూ 144కు పైగా ఉత్తర్వులు జారీ కాగా, ఇప్పుడు ఈ కొత్త నిషేధం కూడా తోడైంది.
ఈ ఉత్తర్వు మహిళల గుర్తింపును చెరిపివేయడమే కాకుండా, వైద్యపరంగా కూడా పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రులలో మహిళలందరి పేర్లను ‘బీబీ’ అని ఒకే రకంగా నమోదు చేయడం వల్ల తీవ్ర గందరగోళం ఏర్పడి, తప్పుడు చికిత్స అందించే ప్రమాదం ఉందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఒక మహిళ అసలు పేరు పెట్టి పిలవడమే కుటుంబ గౌరవానికి భంగంగా భావించే పరిస్థితుల్లో, మహిళలు తమ సొంత పేరును కాపాడుకోవడమే ఒక పెద్ద పోరాటంగా మారింది.

Leave a Reply