గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భార్యనంటూ చెప్పుకుంటూ ఓ యువకుడికి హత్య బెదిరింపులకు పాల్పడిన బిందు అనే మహిళను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శామ్లీ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
జైపూర్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న బిందు, జాట్ మహాసభకు చెందిన ముకుల్ చౌదరికి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతం హర్యానా గాయకుడు అంకిత్ బాలియాన్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అంకిత్ బాలియాన్ 13వ రోజు సంస్మరణ సభ అనంతరం ముకుల్ చౌదరి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో లారెన్స్ బిష్ణోయ్‌ను ఉద్దేశించి ముకుల్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు బిందుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
దీంతో ముకుల్ చౌదరికి మెసెంజర్ ద్వారా ఆమె నేరుగా చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్‌లు పంపింది. ఆ బెదిరింపులు రాగానే ఆయన తక్షణమే శామ్లీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బెదిరింపులు వచ్చిన సోషల్ మీడియా ఖాతాను గుర్తించి జైపూర్‌లో ఉన్న బిందును అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కు చెందిన బిందు జైపూర్‌లో బౌన్సర్‌గా పనిచేస్తోందని పోలీసులు తెలిపారు. ఆమెకు వివాహమై 8 సంవత్సరాలు పూర్తయిందని, నలుగురు పిల్లలు ఉన్నారని, భర్తతో విభేదాల కారణంగా చాలా కాలంగా ఒంటరిగానే ఉంటోందని ప్రాథమిక విచారణలో తేలింది.
బిందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు తీవ్ర అభిమాని అని సమాచారం. లారెన్స్‌ను ఆమె మానసికంగా తన భర్తగా భావిస్తోందని, అయితే ఇప్పటివరకు అతడిని ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా తన చేతిపై ‘లారెన్స్ బిష్ణోయ్’ పేరును పచ్చబొట్టు (టాటూ) కూడా వేయించుకున్నట్లు విచారణలో బయటపడింది. ఎవరైనా లారెన్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా, విమర్శలు చేసినా.. సోషల్ మీడియా ద్వారా వారికి ఈమె బెదిరింపులు పంపుతున్నట్లు గుర్తించారు. అదే క్రమంలోనే ముకుల్ చౌదరిపై కూడా బెదిరింపులకు దిగింది.
ఈ ఘటనపై శామ్లీ ఎస్పీ ఎన్.పి. సింగ్ మాట్లాడుతూ.. ముకుల్ చౌదరిని హతమారుస్తామని బెదిరించిన బిందును అరెస్ట్ చేసినట్లు ధృవీకరించారు. విచారణలో భాగంగా తాను లారెన్స్ బిష్ణోయ్‌ను ఎంతగానో ఆరాధిస్తున్నానని, భారతదేశంలో ఎవరైనా అతడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చెందిన ఇతర సోషల్ మీడియా ఖాతాలను సైబర్ క్రైమ్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏదైనా గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
