ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థానం.. 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చిన కేసులో 24 ఏళ్ల సోమేష్ యాదవ్కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
ఏప్రిల్ 2025లో జరిగిన ఈ ఘోర ఘటనలో, తన సొంత మేనకోడలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసినట్లు కోర్టు విచారణలో సాక్ష్యాధారాలతో రుజువైంది.
ఈ కేసును సమగ్రంగా విచారించిన న్యాయస్థానం.. నిందితుడు సోమేష్ యాదవ్ను పోక్సో చట్టంలోని సెక్షన్ 6(1), భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1), 238(a) కింద దోషిగా తేల్చింది. చిన్నారిపై పాశవిక దాడికి పాల్పడటం, ఆధారాలను చెరిపివేసేందుకు యత్నించడం వంటి తీవ్రమైన నేరాలను BNS చట్టంలోని నిబంధనల ప్రకారం రుజువు చేశారు.
తీర్పు వివరాల ప్రకారం.. దోషికి విధించిన ఉరిశిక్షతో పాటు పోక్సో చట్టం మరియు BNS సెక్షన్ 103(1) కింద ₹5,000 జరిమానా విధించారు. అంతేకాకుండా, సాక్ష్యాధారాలను మాయం చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నేరానికి గాను BNS సెక్షన్ 238(a) కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు అదనంగా మరో ₹1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
