ఆర్మీ పన్నిన పక్కా వ్యూహం: చిక్కిన 21 ఏళ్ల ‘నకిలీ బ్రిగేడియర్’! యూపీలో వెలుగుచూసిన విచిత్ర ఘటన

భారత సైన్యంలో (ఇండియన్ ఆర్మీ) బ్రిగేడియర్ హోదాలో చలామణి అవుతున్న ఒక 21 ఏళ్ల యువకుడిని ఆర్మీ సిబ్బంది శుక్రవారం ఒక రహస్య ఆపరేషన్ (స్ట్రింగ్ ఆపరేషన్) ద్వారా షాజహాన్‌పూర్ కంటోన్మెంట్‌లోని ‘షహీద్ మ్యూజియం’ వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఆర్యన్ వర్మగా గుర్తించబడిన సదరు నిందితుడు, గత కొంతకాలంగా ఆర్మీ సీనియర్ ఆఫీసర్ అధికారిక యూనిఫామ్ ధరించి షాజహాన్‌పూర్ మరియు దాని చుట్టుపక్కల జిల్లాల్లో తిరుగుతూ తాను పెద్ద మిలిటరీ ఆఫీసర్‌నని నమ్మిస్తున్నాడు.

అధికారుల సమాచారం ప్రకారం.. ఆర్యన్ వర్మ తరచూ బ్రిగేడియర్ హోదాకు సంబంధించిన అధికారిక దుస్తులను ధరిస్తూ, తనను తాను ఉన్నతాధికారిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడనే సమాచారం ఆర్మీ అధికారులకు గత ఏప్రిల్ నెలలోనే అందింది. అప్పటి నుండి అతని కదలికలపై నిఘా ఉంచినప్పటికీ, అతను చిక్కకపోవడంతో.. అధికారులు అతనికి ఒక చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు.

ఆర్మీ పన్నిన పక్కా ప్లాన్:
నిందితుడిని ట్రాప్ చేయడం కోసం, ఆర్మీ అధికారులు సాధారణ పౌరులలా (సివిలియన్స్‌లా) నటిస్తూ అతనిని సంప్రదించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ అభ్యర్థులకు మోటివేషనల్ స్పీచ్ (స్ఫూర్తిదాయక ప్రసంగం) ఇవ్వాల్సిందిగా అతనిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఏరియాలోని షహీద్ మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు నమ్మించారు.

దీంతో నిజమైన ఆఫీసర్‌లా బిల్డప్ ఇవ్వడానికి ఆర్యన్ వర్మ శుక్రవారం ఉదయం బ్రిగేడియర్ యూనిఫామ్‌లో అక్కడికి చేరుకున్నాడు. ఆర్మీ సీనియర్ ఆఫీసర్లకు ఉండే నక్షత్రాలు (స్టార్స్), జెండాలు కలిగిన ఒక లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కారులో అతను వేదిక వద్దకు రాగా.. అతను రాగానే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్మీ సిబ్బంది తక్షణమే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అతని కారు డ్రైవర్ వద్ద ఉన్న నకిలీ ప్రభుత్వ గుర్తింపు కార్డును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు బౌన్సర్లు.. ఎన్‌ఎస్‌జీ కమాండోలుగా బిల్డప్!
విచారణలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వర్మ వెంట ఇద్దరు బౌన్సర్లు కూడా ఉన్నారు. వారిని అతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలుగా ఇతరులకు పరిచయం చేసేవాడు. తనకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించిందని చెప్పుకుంటూ, ఒక హై-ప్రొఫైల్ మిలిటరీ ఆఫీసర్‌లా అందరినీ బురిడీ కొట్టించాడు.

అధికారులు అతని నుండి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (AFMC) డీన్ ముద్రతో ఉన్న ఒక నకిలీ ఐడెంటిటీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అది ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. వీటితో పాటు ఆర్మీ రెజిమెంటల్ కేన్ (అధికారిక కర్ర) మరియు ఒక నకిలీ పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బరేలీకి చెందిన ఆర్మీ ఇంటెలిజెన్స్ బృందం ఈ కేసును చేతుల్లోకి తీసుకుని, అతను ఇలా ఆర్మీ ఆఫీసర్‌లా నటించడానికి గల అసలు కారణం ఏంటనే కోణంలో నిందితుడిని తీవ్రంగా ప్రశ్నిస్తోంది.

ఈ నకిలీ వ్యవహారం వెనుక ఎవరెవరి హస్తం ఉంది, ఫోర్జరీ పత్రాలు మరియు ఆర్మీ యూనిఫామ్‌ను ఎక్కడి నుండి సేకరించారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దీనిపై జిల్లా ఎస్పీ సౌరభ్ దీక్షిత్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆర్మీ అధికారులు వర్మను విచారిస్తున్నారని, ఆర్మీ విచారణ పూర్తి చేసి నిందితుడిని పోలీసుల కస్టడీకి అప్పగించిన వెంటనే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడతామని తెలిపారు.

నీట్ (NEET) ఫెయిల్ అవ్వడంతో..
స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం.. ఆర్యన్ వర్మ వయస్సు 21 ఏళ్లు. అతను దిల్లీలో ఉంటూ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఈ పరీక్షలో అతను పలుమార్లు ఫెయిల్ అయినట్లు అధికారులు గుర్తించారు. వర్మ తండ్రి హార్టికల్చర్ (తోటల పెంపకం) శాఖలో అధికారిగా పనిచేస్తుండగా, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *