“ఆస్తి కోసం కన్నవాళ్లనే కడతేర్చారా?”.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద మృతి.. నివ్వెరపోయిన బంధువులు..!!

గ్రేటర్ నోయిడా సమీపంలోని నంగ్లా శ్రీగోపాల్ గ్రామంలో మహేష్, ఆయన భార్య లలిత, వీరి ముగ్గురు పిల్లలు లడ్డూ, మిష్టి, సాక్షాత్‌లు తమ ఇంట్లోనే విగతజీవులుగా లభ్యమైన విషాద ఘటన ఆ ప్రాంతాన్నంతటినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇంటి తలుపులు ఎంతసేపటికీ తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు లోపలికి వెళ్లి చూడగా.. ఐదుగురూ పడకపైనే నిర్జీవంగా పడి ఉండటం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఇది ఆహారం విషతుల్యం (ఫుడ్ పాయిజనింగ్) కావడం వల్ల జరిగిన ప్రమాదమా లేక పక్కా ప్రణాళికతో చేసిన ఘోర హత్యలా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ విషాదం వెనుక తీవ్రమైన ఆస్తి వివాదం ఉందని లలిత కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. 2015-16లో భూసేకరణ కింద వచ్చిన నష్టపరిహారం మొత్తాన్ని అత్తగారు తనవద్దే ఉంచుకుని, మహేష్‌కు ఏమీ ఇవ్వకుండా మోసం చేసినట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా, సుమారు ఆరు నెలల క్రితం 10 బీఘాల భూమిని, ఇటీవలే వారు నివసిస్తున్న ఇంటిని సైతం అత్తగారు తన కుమార్తె (మహేష్ సోదరి) పేరు మీద రాసిచ్చారు. ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి భవిష్యత్తు అంధకారమై తీవ్ర మనోవేదనలో ఉన్న మహేష్ కుటుంబాన్ని.. అత్తగారు, ఆమె కుమార్తె కలిసి కుట్రపన్ని కడతేర్చారని లలిత బంధువులు కన్నీరుమున్నీరవుతూ ఆరోపించారు.

సమాచారం అందుకున్న వెంటనే సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM), పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష (పోస్ట్‌మార్టం) నిమిత్తం తరలించారు. శుక్రవారం రాత్రి అందరూ కలిసి నూడుల్స్ తిని నిద్రపోయిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు వెలుగుచూస్తాయని పోలీసులు వెల్లడించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *