వృద్ధాప్యంలోనూ ప్రేమకు, కొత్త జీవితానికి వయసు ఏమాత్రం అడ్డంకి కాదని చాటిచెప్పే ఓ హృదయస్పర్శి ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
బిలాస్పూర్ జిల్లాలోని ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 75 ఏళ్ల కన్హయ్య లాల్, 63 ఏళ్ల సబీనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 25వ తేదీన వీరి వివాహం జరగనుంది. ఒంటరితనంలో, జీవితపు కఠిన పరిస్థితుల్లో ఉన్న వీరిద్దరికీ ఒకరికొకరు ఓదార్పుగా, తోడుగా నిలిచిన బంధం ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది.
కన్హయ్య లాల్ మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతానికి చెందినవారు. గతంలో వివాహమైన ఆయన, వ్యవసాయం చేసుకుంటూ భార్యతో కలిసి జీవించేవారు. అయితే అనారోగ్య కారణాలతో భార్య మరణించడంతో కన్హయ్య లాల్ జీవితం తలకిందులైంది. సంతానం లేకపోవడంతో తన వ్యవసాయ భూమిని సోదరుల పేరిట రాసిచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు విషమించడంతో ఇల్లు వదిలి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం.
బంధువుల నుంచి సరైన ఆదరణ లభించకపోవడంతో, ఒక దశలో అటవీ ప్రాంతంలోని గుహలో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. అనంతరం 2022లో ఆయన దయోలి ప్రాంతంలో నడుస్తున్న ‘అప్నా ఘర్’ వృద్ధాశ్రమంలో చేరారు. మరోవైపు కోల్కతాకు చెందిన 63 ఏళ్ల సబీనా కూడా ఎన్నో జీవిత పోరాటాలను దాటుకుని అదే వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. సిమ్లాలోని మషోబ్రా ప్రాంతంలో ఆమెను గుర్తించి ఆశ్రమానికి తరలించినట్లు వార్తలు చెబుతున్నాయి.
వృద్ధాశ్రమంలో కలుసుకున్న వీరిద్దరూ కాలక్రమేణా ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరయ్యారు. ఒంటరితనంలో ఉన్న వారికి ఈ బంధం మానసికంగా ఎంతో అండగా నిలిచింది. దీంతో వివాహం చేసుకుని మిగిలిన జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు. ముందుగా కోర్టు వివాహం జరగనుందని, ఆ తర్వాత వృద్ధాశ్రమంలోనే హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని.. ప్రేమ, తోడు దొరికితే జీవితంలో ఏ వయసులోనైనా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చని ఈ ఘటన ఎంతో భావోద్వేగంతో చాటిచెబుతోంది.

Leave a Reply