రాజస్థాన్ రాష్ట్రం దౌసా జిల్లాలో, స్కూల్ యూనిఫామ్ ధరించిన ఇద్దరు బాలికలను దుండగులు అపహరించి, వారిపై లైంగిక దాడికి యత్నించిన భయానక వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయి తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
ఒక పాడుబడిన భవనంలోకి బాలికలను బలవంతంగా లాక్కెళ్లడం, వారు ప్రాధేయపడుతూ ఏడవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న దౌసా పోలీస్ సూపరింటెండెంట్ (SP) పీయూష్ దీక్షిత్, వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇద్దరు అనుమానితులను గుర్తించారు. వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
అయితే, ఈ సంఘటన పాతదిగా చెప్పబడుతున్న తరుణంలో.. ఇది ముందే పోలీసుల దృష్టికి ఎందుకు రాలేదనే ప్రశ్న, అలాగే వీడియో తీసిన వ్యక్తి బాలికలను కాపాడకుండా ఎందుకు చూస్తూ ఊరుకున్నాడనే ప్రశ్నలు సమాజంలో తలెత్తుతున్నాయి.
బాధిత పిల్లల గుర్తింపును కాపాడటం చట్టపరమైన బాధ్యత కావున, ఇటువంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా, నిందితులను అరెస్ట్ చేసి, ఈ వీడియో యొక్క నిజానిజాలను నిర్ధారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
