మహారాష్ట్రలోని జల్గావ్ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి ఇంట్లోనే ఆయుధాలతో వచ్చిన దొంగల ముఠా చొరబడి దర్జాగా దోపిడీకి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
సామాన్య ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి నివాసానికే వెళ్లి.. తుపాకులు, కత్తులతో బెదిరించి సాగించిన ఈ తెగింపు దోపిడీ, స్థానికంగా ఉన్న భద్రతా డొల్లతనాన్ని బట్టబయలు చేసింది.
వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి సమయంలో చేతుల్లో తుపాకులు, పదునైన కత్తులతో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పోలీస్ అధికారి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అనుకోకుండా ఆయుధాలతో ఇంట్లోకి దూసుకొచ్చిన దుండగులను చూసి ఒక్కసారిగా నివ్వెరపోయిన ఆ అధికారి.. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకునేందుకు వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు.
అక్కడి నుంచే అత్యవసర సహాయం కోసం తన తోటి పోలీసు అధికారులకు, కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్న ఆ ముఠా క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి పరారైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాష్‌రూమ్‌లో చిక్కుకున్న అధికారిని బయటకు తీసుకొచ్చి, పరారైన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులకే రక్షణ లేని పరిస్థితి నెలకొనడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
