హంపి అత్యాచారం & హత్య కేసు: చారిత్రక నగరం హంపి సమీపంలో గత ఏడాది జరిగిన ఆ భయంకరమైన ఉదంతం భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సనాపూర్ సరస్సు తీరాన సంగీతాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై విరుచుకుపడి ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. గంగావతి సివిల్ కోర్టు న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ ఈ కేసును ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైనది’ (Rare of the rarest) గా పేర్కొన్నారు.
ఆ రాత్రి ఏం జరిగింది? తేదీ 6 మార్చి 2025. రాత్రి 11 గంటల సమయంలో సనాపూర్ సరస్సు ఒడ్డున ఒక హోమ్‌స్టే నిర్వాహకుడు మరియు నలుగురు పర్యాటకులు (మహారాష్ట్ర, ఒడిశా, అమెరికా మరియు ఇజ్రాయెల్‌కు చెందిన వారు) గిటార్ వాయిస్తూ గడుపుతున్నారు. ఆ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి మల్లేష్, శరణబసవ మరియు చైతన్య సాయి అనే ముగ్గురు యువకులు మోటార్ సైకిల్‌పై అక్కడకు చేరుకున్నారు.
పెట్రోల్ అడిగే నెపంతో మొదలైన క్రూరత్వం: నిందితులు మొదట పెట్రోల్ బంక్ చిరునామా అడిగి, ఆపై బలవంతంగా డబ్బులు డిమాండ్ చేశారు. పర్యాటకులు ప్రతిఘటించడంతో వివాదం మొదలైంది. గొడవను ఆపడానికి ఒడిశాకు చెందిన పర్యాటకుడు బిభాస్ వారికి 20 రూపాయలు ఇచ్చాడు. అది చూసి నిందితులు రెచ్చిపోయారు. ముగ్గురు పురుష పర్యాటకులను లోతైన కాలువలోకి నెట్టివేశారు. ఈ ప్రమాదంలో బిభాస్ నీటిలో మునిగి మరణించాడు. ఆ తర్వాత కామాంధులు హోమ్‌స్టే నిర్వాహకురాలు మరియు ఇజ్రాయెల్ మహిళా పర్యాటకులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెళ్తూ వెళ్తూ వారి మొబైళ్లు, నగదు దోచుకెళ్లారు.
10 నెలల్లోనే డెత్ వారెంట్: ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను దెబ్బతీసింది. కేసు తీవ్రతను బట్టి దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించారు.
- 7 ఫిబ్రవరి 2026: ముగ్గురిని దోషులుగా నిర్ధారించారు.
- 16 ఫిబ్రవరి 2026: న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
