హర్యానాలోని పల్వాల్ జిల్లాలో వరకట్న వేధింపుల కారణంగా చోటుచేసుకున్న దారుణ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రాజ్‌పురా గ్రామంలో షగుఫ్తా అనే మహిళ, ఆమె రెండు నెలల పసికందు అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. భర్త సోహైల్ వీరిద్దరినీ హత్య చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన అనంతరం అతడు ఇంటి పైఅంతస్తు నుంచి కిందకు దూకడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
షగుఫ్తా కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. పెళ్లయినప్పటి నుంచి ‘స్కార్పియో’ కారు కొనివ్వాలని భర్త, అత్తమామలు తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవారు. బాబు పుట్టిన తర్వాత వీరి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, వరకట్నం కోసం షగుఫ్తాను నిత్యం వేధించారని కుటుంబీకులు తెలిపారు. ఆగస్టు 15న ఆమెను పుట్టింటికి పంపించగా, పెద్దల సమక్షంలో జరిగిన రాజీ చర్చల అనంతరం ఆగస్టు 17న తిరిగి అత్తగారింటికి పంపించినట్లు సమాచారం.
తల్లీబిడ్డలిద్దరూ చనిపోయారన్న వార్త తెలుసుకున్న బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఇద్దరి మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భర్తను నమ్మి కాపురానికి వెళ్లిన కేవలం రెండు రోజులకే ఈ దారుణం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త సోహైల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. క్షణికావేశంలో, మద్యం మత్తులో తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అతడు అంగీకరించినట్లు తెలిసింది. అదే సమయంలో వరకట్న వేధింపుల కోణంలోనూ, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి.

Leave a Reply