ముంబై: ఇంజెక్షన్లు అంటే ఉన్న భయం కారణంగా రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోని తొమ్మిదేళ్ల బాలిక, రేబిస్ వ్యాధితో మరణించింది. నాలుగో తరగతి చదువుతున్న కాశిష్ సహాని అనే బాలిక, ఆరు నెలల క్రితం తన తాతయ్యతో కలిసి వెళ్తుండగా ఒక వీధి కుక్క ఆమెను గీరింది.
వెంటనే ఆమెను యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఇంజెక్షన్ అంటే విపరీతమైన భయంతో ఆమె దానిని నిరాకరించింది. కొన్ని రోజుల్లోనే ఆ గాయం తగ్గిపోవడంతో, కుటుంబ సభ్యులు కూడా ఆమెను చికిత్స కోసం బలవంతం చేయలేదు.
అయితే, కొన్ని రోజుల క్రితం కాశిష్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ఆమె ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం మానేసింది. కళ్లు కూడా ఎర్రగా మారాయి. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రికి తరలించినప్పటికీ, సోమవారం ఆమె మరణించింది.
బాలిక మరణం తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు మరియు ఆమెతో సన్నిహితంగా ఉన్న పొరుగువారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
వైద్యుల హెచ్చరిక: కుక్కలు లేదా పిల్లులు కరిచినా, లేదా చిన్న గీత పడినా సరే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాయం చిన్నదైనా సరే వెంటనే వైద్య సహాయం పొంది, పూర్తిస్థాయి వ్యాక్సిన్ కోర్సును పూర్తి చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు.
