ఇంటర్న్‌షిప్ అడిగిన యువకుడికి ఇలాంటి అవమానమా.? “నువ్వేమైనా పెద్ద తోపువా. నీకు సమాధానం చెప్పాలా.?” అని విరుచుకుపడ్డ కంపెనీ వ్యవస్థాపకుడు.! పని, జీతం గురించి అడిగితే ఇంత పొగరుగా బదులిస్తారా.? ఈమెయిల్‌ను బయటపెట్టిన యువకుడు. నెట్టింట మండిపడుతున్న నెటిజన్లు.!!

ఉద్యోగాలు వెతికే యువకులు కంపెనీల వ్యవస్థాపకులకు, హెచ్‌ఆర్ (HR) అధికారులకు నేరుగా ఈమెయిల్ పంపి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్ వివరాలను అడగటం సాధారణమే.

అలా ఇంజనీరింగ్ ఇంటర్న్‌షిప్ కోసం ఒక కంపెనీ వ్యవస్థాపకుడికి ఈమెయిల్ పంపిన దివ్యాన్ష్ అనే యువకుడికి, ఊహించని విధంగా అత్యంత అవమానకరమైన సమాధానం ఎదురైంది. ఈ అనుభవాన్ని అతను సోషల్ మీడియాలో పంచుకోవడంతో తీవ్ర చర్చ మొదలైంది.

దివ్యాన్ష్ తన ఈమెయిల్‌లో, కంపెనీలో ఇంటర్న్‌షిప్ అవకాశం ఉందా అని, ఒకవేళ పనిలో చేరితే ఏయే ప్రాజెక్టులు లేదా సాంకేతిక సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావచ్చని అడిగాడు. అంతేకాకుండా, శిక్షణకు ముందు అభ్యర్థుల ప్రతిభను కంపెనీ ఏ ప్రాతిపదికన అంచనా వేస్తుందో కూడా తెలుసుకోవాలనుకున్నాడు. జనవరి 2027లో ప్రారంభం కానున్న ఆరు నెలల శిక్షణకు స్టైపెండ్ (Stipend) గురించి, ప్రారంభ దశ పనికి వేతనం చెల్లిస్తారా అని ఎంతో మర్యాదగా ప్రశ్నించాడు.

కానీ, అతని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా, కంపెనీ వ్యవస్థాపకుడు దివ్యాన్ష్ ప్రతిభను, ఇంజనీరింగ్ అర్హతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. “నువ్వు అంత గొప్ప వ్యక్తవని ఎందుకు అనుకుంటున్నావు? నీ ప్రశ్నలకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి? నువ్వు ఇంజనీర్‌గా అర్హుడివి అని నిరూపించుకోగలవా?” అనే టోన్‌లో అతను బదులిచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన దివ్యాన్ష్, ఆ ఈమెయిల్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ వేగంగా వైరల్ కావడంతో చాలా మంది దివ్యాన్ష్‌కు మద్దతుగా నిలిచారు. ఇంటర్న్‌షిప్‌ను అంగీకరించే ముందు పని బాధ్యతలు, జీతం, ఎంపిక ప్రక్రియ వంటి కనీస వివరాలను అడగడంలో ఎలాంటి తప్పు లేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన కంపెనీల్లో పనిచేయకపోవడమే మంచిదని కొందరు సూచించారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువత పట్ల కంపెనీలు ఎలా వ్యవహరించాలనే చర్చను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *