తెలంగాణ రాష్ట్రంలో, పుట్టింటి నుంచి తిరిగి తన ఇంటికి రావడానికి నిరాకరించిందనే కోపంతో భార్య ముక్కును భర్తే కిరాతకంగా కొరికి తుంచేసిన షాకింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది.
కోటపల్లికి చెందిన మమత, మల్లాంపేటకు చెందిన మణిచందర్లకు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా మమత భర్తను విడిచిపెట్టి తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది.
ఘటన జరిగిన రోజు మణిచందర్ తన భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు అత్తగారింటికి వచ్చాడు. ఆ సమయంలో మమత రావడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మణిచందర్, తన మామ నారాయణ తలపై కర్రతో దారుణంగా దాడి చేశాడు. ఇది చూసి షాక్కు గురైన మమత, తన తండ్రిని కాపాడుకోవడానికి పరుగెత్తుకు రాగా, మణిచందర్ ఆమెపై కూడా దాడి చేసి ముక్కును కొరికేశాడు.
ఈ దాడిలో మమత ముక్కు కొంతభాగం తెగిపడి రక్తం మడుగులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మమతను, ఆమె తండ్రిని స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply