“ఇంటి గుమ్మం దాకా వచ్చేశాననుకున్న 88 ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు సంచీని లాక్కెళ్లిన దుండగుడు.. తూలుతూనే వెంటపడిన బాధితుడు.. గుండెల్ని పిండేసే వీడియో.!”

ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ విజయ్ నిశ్చల్ భర్త, 88 ఏళ్ల హరిశ్చంద్ర నిశ్చల్ చేతిలోని డబ్బుల సంచీని గుర్తుతెలియని వ్యక్తి లాక్కుని పారిపోయిన ఘటన కలకలం రేపింది.

శుక్రవారం పట్టపగలు ఆయన ఇంటి సమీపంలోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని తిరిగి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఓ దుండగుడు ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

హరిశ్చంద్ర నిశ్చల్ ఇంటి అవసరాల కోసం సరుకులు కొనుగోలు చేసేందుకు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసినట్లు సమాచారం. డబ్బుల బ్యాగ్‌తో తన ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకోగానే.. వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాగ్‌ను లాక్కొని పరారయ్యాడు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ వృద్ధుడు నిందితుడిని పట్టుకునేందుకు వయసు పైబడిన శరీరంతో తూలుతూనే అతడి వెంటే పరుగుతీశాడు. అయితే, దుండగుడు అప్పటికే అక్కడి నుంచి పారిపోవడంలో సఫలమయ్యాడు.

ఘటన జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) వాహన సిబ్బంది హరిశ్చంద్ర నిశ్చల్‌ను గమనించి, ఏమి జరిగిందో ఆరా తీశారు. కానీ అప్పటికే దొంగ పారిపోయాడు. అనంతరం ఆ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, బ్యాంకులో ఉన్న తన మిగిలిన పొదుపు మొత్తానికి కూడా భద్రత కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ దోపిడీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హరిశ్చంద్ర నిశ్చల్, సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందిన ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ విజయ్ నిశ్చల్ భర్త కావడం గమనార్హం. విజయ్ నిశ్చల్ “దాదీ కీ రసోయ్” పేరుతో వంటకాల వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె భర్తపై జరిగిన ఈ దారిదోపిడీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు.


Posted

in

by

Tags: