ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సమీపంలోని బిల్హౌర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఓ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
45 ఏళ్ల వ్యాపారవేత్త రాజ్ కిషోర్ పట్వా సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన తల నరికిన స్థితిలో మొండెం రోడ్డుపై పడి ఉంది.
రోడ్డుపై తలలేని మొండాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో రాజ్ కిషోర్ సైకిల్ కూడా పడి ఉంది. దీంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. సుమారు గంటపాటు గాలించిన తర్వాత, మొండెంకు 10 నుంచి 12 అడుగుల దూరంలో నీరు నిలిచి ఉన్న ఓ గుంతలో నరికిన తలను గుర్తించారు.
రాజ్ కిషోర్ మహిళల అలంకరణ వస్తువులకు (కాస్మెటిక్స్) సంబంధించిన వ్యాపారం చేసేవాడని, ఘటన జరిగిన రోజు ఉదయం సైకిల్‌పై గ్రామానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బయటకు వెళ్లిన కొద్దిసేపటికే అతని హత్య గురించి సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు గల కారణాలు ఏమిటి, ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కుటుంబ సభ్యులను విచారించి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply