ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న ముస్కాన్ (21) అనే విద్యార్థిని, మోడల్.. తన ఇంట్లోని రెండవ అంతస్తులో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కత్తిపోట్లకు గురై దారుణ హత్యకు గురైంది.
ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు పరుగున వచ్చి చూశారు. తీవ్ర రక్తపు మడుగులో ఉన్న ఆమెను వెంటనే రక్షించి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే, కత్తిపోట్ల తీవ్రత అధికంగా ఉండటంతో వైద్యుల చికిత్స ఫలించక ఆమె ప్రాణాలు విడిచింది.
ఈ దారుణ ఘటనలో ముస్కాన్‌కు గతంలోనే పరిచయమున్న జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ అనే వ్యక్తిపై పోలీసులకు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన వెంటనే అతను అక్కడి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లడంతో, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇమ్రాన్ గతంలో కూడా ముస్కాన్‌ను పలుమార్లు వేధించాడని ఆమె సోదరీమణులు, స్నేహితుడు అమన్ పోలీసులకు తెలిపారు. ఈ వివరాల ఆధారంగా, వారిద్దరి మధ్య ఉన్న పాత పరిచయం, విభేదాల కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసు పూర్వాపరాలను నిగ్గుతేల్చేందుకు ఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీలు, ముస్కాన్ కాల్ డేటా రికార్డులను (CDR) అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు ఇమ్రాన్ ఇంకా పట్టుబడకపోవడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తేనే హత్యకు గల అసలు కారణం, ఇందులో ఇతరుల ప్రమేయం ఏదైనా ఉందా అనేది స్పష్టమవుతుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువతి ఇలా అకాల మరణం చెందడం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Leave a Reply