డబ్బు కోసం తప్పుడు మార్గాలను ఎంచుకునే ప్రస్తుత కాలంలో, తనకు చూపిన ప్రలోభాన్ని తృణప్రాయంగా భావించి, తన సిద్ధాంతం, నిజాయితీకే కట్టుబడిన ఒక ర్యాపిడో బైక్ డ్రైవర్ చర్య సోషల్ మీడియాలో ఎంతో మంది హృదయాలను హత్తుకోవడంతో పాటు పెద్ద చర్చకు దారితీసింది.
ఘటన జరిగిన రోజు, ఓ మహిళా కస్టమర్ తన ప్రయాణం కోసం ర్యాపిడో ద్విచక్ర వాహనాన్ని (బైక్ ట్యాక్సీ) బుక్ చేసుకుంది. డ్రైవర్ ఆమె ఉన్న చోటికి చేరుకోగానే, ఆ మహిళ అతడిని తన ఇంట్లోకి రావాల్సిందిగా పిలిచింది. కానీ, ఎంతో సాదాసీదాగా, నిజాయితీగా ఉండే ఆ డ్రైవర్, ఇంట్లోకి రావడం కుదరదని ఖరాఖండిగా చెప్పేసి, కేవలం రైడ్ మాత్రమే చేస్తానని అన్నాడు.
అయినప్పటికీ, ఆ మహిళ డ్రైవర్‌ను బలవంతపెట్టే ఉద్దేశ్యంతో.. ‘నీ రైడ్ ఛార్జీ రూ. 300 మాత్రమే. కానీ, నువ్వు కేవలం 10 నిమిషాలు ఇంట్లోకి వస్తే నీకు రూ. 1,000 ఇస్తాను, ఆ తర్వాత నువ్వు వెళ్లిపోవచ్చు’ అని ఆశ చూపింది. దానికి ఏమాత్రం చలించని ఆ డ్రైవర్, ‘నాకు ఆ డబ్బు వద్దు మేడమ్; మీరు రూ. 1,00,000 ఇచ్చినా నేను లోపలికి రాను’ అని చెప్పి ఆమె కోరికను సున్నితంగా కానీ ఖచ్చితంగా తిరస్కరించాడు.
డబ్బుకి లోకం దాసోహం అని చెప్పుకునే ఈ రోజుల్లో, తన ముందుంచిన డబ్బు ఆశను పక్కనపెట్టి తన ఆత్మాభిమానాన్ని, నిజాయితీని కాపాడుకున్న ఆ సామాన్యుడి చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి ఏ పరిస్థితుల్లోనూ తప్పు చేయలేడని నిరూపించే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ, ఆ డ్రైవర్‌పై ప్రజల ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

Leave a Reply