ఇంట్లో చేసిన నూడుల్స్ తిన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. అక్క కళ్లుతెరిచింది.. కానీ 7 ఏళ్ల చెల్లి మాత్రం లేవలేదు! ఆసుపత్రిలో వైద్యులు చెప్పిన విషయం విని తల్లిదండ్రులకు షాక్!

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తయారు చేసిన నూడుల్స్ తిన్న ఏడేళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. అదే ఆహారం తిన్న ఆమె అక్క కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఆహారంలో విషపదార్థాలు కలవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే బాలిక మృతికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

జైపూర్‌లోని జోత్వారా ప్రాంతం మంగళం సిటీలో ఈ ఘటన జరిగింది. గత గురువారం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే నూడుల్స్ తయారు చేసుకుని తిన్నారు. ఆ తర్వాత నిద్రపోయారు.

మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వారి తల్లి పిల్లలను నిద్రలేపేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పెద్ద కుమార్తె దివ్యాంశి నిద్రలేచింది. కానీ ఏడేళ్ల చిన్నారి పిహు కుమావత్ మాత్రం ఎంత ప్రయత్నించినా లేవలేదు.

దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి పిహు అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన పెద్ద కుమార్తె దివ్యాంశికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం శుక్రవారం ఉదయం ఆమె కోలుకోవడంతో ఇంటికి పంపించారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తయారు చేసిన నూడుల్స్‌లో ఏదైనా విషపదార్థం కలిసిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వాటి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. పోస్టుమార్టం నివేదిక, ల్యాబ్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే బాలిక మృతికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఈ కుటుంబానికి చెందిన గోవింద్ అనే కుమారుడు కూడా గత రెండు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *