జైపూర్: మీరు కూడా మీ ఇంట్లో పనివారిని పెట్టుకున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇంటి నౌకరును గుడ్డిగా నమ్మడం మీ కొంప ముంచవచ్చు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక డాక్టర్ ఇంట్లో జరిగిన ఘోరమే దీనికి నిదర్శనం. ఇక్కడ ఒక నౌకరు తన యజమాని వద్ద 10 ఏళ్లుగా పనిచేస్తూ, అందరి నమ్మకాన్ని గెలుచుకున్నాడు. కానీ అదంతా అదను చూసి దెబ్బ కొట్టడానికే అని చివరకు తేలింది. మరో పనిమనిషిని తన వైపు తిప్పుకుని, ఏకంగా ₹50 లక్షల రూపాయల యజమాని సొమ్ముతో పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడైన నౌకరుతో పాటు అతని సహాయకురాలిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది? జైపూర్‌లోని సాంగానేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డాక్టర్ ప్రభాకర్ సేథీ ఇంట్లో ఈ భారీ దొంగతనం జరిగింది. మార్చి 26న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మనవరాలి ఫీజు కోసం ఫిబ్రవరి 22న కిచెన్‌లో జాగ్రత్తగా దాచిన ₹50 లక్షలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
గ్రాడ్యుయేట్ నౌకరు.. 10 ఏళ్ల నమ్మకం: డాక్టర్ ఇంట్లో సుమిత్ ఖేతాన్ అనే నౌకరు 10 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను గ్రాడ్యుయేట్ (డిగ్రీ) చదివిన వ్యక్తి. అతనితో పాటు సీమ అనే పనిమనిషి కూడా అక్కడ పనిచేస్తోంది. మార్చి 19న డాక్టర్ పెంపుడు కుక్క అకస్మాత్తుగా మరణించింది. ఆ తర్వాతే ఆయనకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. సుమిత్‌పై నిఘా పెట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
సిసిటివి కెమెరాలతోనే నిఘా! నౌకరు సుమిత్ వద్ద ఇంటి సీసీటీవీ కెమెరాల యాక్సెస్ ఉండేది. డాక్టర్ డబ్బులు ఎక్కడ దాస్తున్నారో కెమెరాల ద్వారా గమనించిన సుమిత్, ఆ తర్వాత సీమ అనే పనిమనిషిని కూడా తన ప్లాన్‌లోకి లాగాడు. కేవలం 20 రోజుల్లోనే విడతల వారీగా ₹50 లక్షలను కాజేశాడు. రీసెంట్ గా అతను విలాసవంతమైన బట్టలు, ఖరీదైన ఆహారం కోసం భారీగా ఖర్చు చేయడం పోలీసుల కంటబడింది. దీంతో పోలీసులు గట్టిగా విచారించగా అసలు రంగు బయటపడింది. ప్రస్తుతం పోలీసులు దొంగిలించిన సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్నారు.
