ఇంట్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని యువతి మొర; ఎవరూ నమ్మలేదు, చివరకు నిజం బయటపడటంతో పోలీసులు కూడా షాక్!

లండన్: తన ఇంట్లో ఎవరో ఉన్నారని, వింత శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పిన ఒక యువతిని పోలీసులు, డాక్టర్లు కలిసి ‘మానసిక రోగి’గా ముద్ర వేశారు. ఆమెకు బలమైన ‘యాంటీ సైకోటిక్’ మందులు ఇచ్చి చికిత్స చేయడం కూడా ప్రారంభించారు. అయితే, కొన్నాళ్ల తర్వాత పోలీసులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజం బయటపడింది. ఆ యువతి చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ఆమె ఇంట్లో మరొక వ్యక్తి రహస్యంగా నివసిస్తున్నాడని తేలింది. యూకేలో ఈ ఘటన చోటుచేసుకుంది.

యూకేలోని కెంట్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల క్లోయి అనే యువతి, తనకు ఎదురైన ఈ భయంకర అనుభవాన్ని పంచుకుంది. ఆమెకు 20 ఏళ్ల వయసున్నప్పుడు ఒక ఫ్లాట్‌లో నివసిస్తున్న సమయంలో సీలింగ్‌లోని లోఫ్ట్ హాచ్ (టెర్రస్‌కి వెళ్లే చిన్న తలుపు) తెరిచి ఉండటాన్ని గమనించింది. మొదట దానిని పెద్దగా పట్టించుకోకపోయినా, ఆ రాత్రి నుండి ఆమెలో తెలియని భయం మొదలైంది. “అక్కడ ఎవరో ఉన్నారు, నన్ను గమనిస్తున్నారు” అని ఆమెకు అనిపించేది.

భయంతో వణికిపోయిన క్లోయి తన స్నేహితుడిని పిలిచి తనిఖీ చేయమని కోరినా, అతనికి ఏమీ కనిపించలేదు. రాత్రి పడుకున్నప్పుడు పైన ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దాలు వినిపించేవని క్లోయి చెప్పింది. స్నేహితులు, పొరుగువారు ఎవరూ ఆమె మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి పోలీసులకు, డాక్టర్లకు సమాచారం అందించగా.. అది ఆమె భ్రమ (Delusion) అని, మానసిక సమస్య అని కొట్టిపారేశారు. రెండు నెలల పాటు ఆమె బలవంతంగా మందులు వాడాల్సి వచ్చింది.

ఒక రాత్రి ఆ ఆగంతకుడు టెర్రస్ తలుపు తెరిచి తన వైపు తీక్షణంగా చూడటాన్ని క్లోయి గమనించింది. వెంటనే ఆమె కిందకు పరుగెత్తి స్నేహితుడి సహాయం కోరింది. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా.. క్లోయి చెప్పింది అక్షర సత్యమని తేలింది. అక్కడ ఒక వ్యక్తి కొన్ని రోజులుగా బ్యాగులతో సహా రహస్యంగా నివసిస్తున్నాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేయడంతో, తాము ఎంత పెద్ద తప్పు చేశామో అందరికీ అర్థమైంది.


Posted

in

by

Tags: