ఇండోర్ విషాదం: 10 ఏళ్ల మొక్కుల తర్వాత పుట్టిన కొడుకు.. పాలు పల్చగా చేసేందుకు నీళ్లు కలిపిన తల్లి.. ఆ నీరే పసివాడి ప్రాణం తీసింది!

ఇండోర్: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరుగాంచిన ఇండోర్‌లో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భగీరథ్‌పురా ప్రాంతంలో కలుషితమైన తాగునీరు తాగి, 5 నెలల పసికందు అవ్యాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాలను పల్చగా చేయడానికి తల్లి వాడిన నీరే ఆ పసివాడికి కాలయముడైంది.

కన్నతల్లి ప్రేమ.. వ్యవస్థ నిర్లక్ష్యం
అవ్యాన్ తండ్రి సునీల్ సాహు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం తన కుమారుడికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ సలహా మేరకు ఇంట్లోనే మందులు ఇస్తున్నారు. ఈ క్రమంలో పసివాడికి బయట కొన్న పాలు పట్టిస్తున్నారు. ఆ పాలు పల్చగా ఉండాలని మున్సిపల్ కుళాయి నీటిని కలిపారు. కానీ, తాగడానికి ఇచ్చే ఆ నీరే ప్రాణాలు తీస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు.

పరిస్థితి విషమించి పసివాడు మృతి
పాలలో కలిపిన కలుషిత నీరు కడుపులోకి వెళ్లడంతో అవ్యాన్ పరిస్థితి మరింత క్షీణించింది. వాంతులు, విరేచనాలు ఆగకపోవడంతో చివరకు డిసెంబర్ 29న ఆ ఐదు నెలల చిన్నారి కన్నుమూశాడు. 10 ఏళ్ల వేచి చూసిన తర్వాత పుట్టిన బిడ్డ ఇలా కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

ఒకే ప్రాంతంలో వందలాది మంది అస్వస్థత
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఒక్క భగీరథ్‌పురా ప్రాంతంలోనే గత వారం రోజుల్లో 1100 మందికి పైగా వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. వీరిలో సుమారు 150 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఆసుపత్రులన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.

ప్రాథమిక విచారణలో షాకింగ్ నిజాలు
తాగునీటి పైపులైన్ లీక్ కావడంతో అందులోకి మురుగునీరు చేరిందని అధికారుల విచారణలో తేలింది. దీనివల్లనే ఆ ప్రాంతమంతా వ్యాధులు ప్రబలాయి. ఇంతటి నిర్లక్ష్యం ఎవరి వల్ల జరిగింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

మరణాల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు
కలుషిత నీటి వల్ల ఇప్పటివరకు 7 గురు మరణించినట్లు ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ ధృవీకరించారు. అయితే, స్థానికులు మాత్రం గత వారం రోజుల్లో కనీసం 9 మంది చనిపోయారని చెబుతున్నారు. మరణించిన వారిలో ఆరు నెలల చిన్నారితో పాటు ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.


Posted

in

by

Tags: