సాధారణంగా పాఠశాల పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయే 14 ఏళ్ల వయసులో, భారత్కు చెందిన యువ ప్రతిభావంతుడు జైనమ్ జైన్ దుబాయ్లో తన సొంత ‘ఏఐ (AI) స్టార్టప్’ను ప్రారంభించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు.
‘మాంగో ఇంజిన్’ (Mango Engine) పేరుతో తన సంస్థను ప్రారంభించిన ఆయన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన ‘బుర్జ్ ఖలీఫా’లో 141వ అంతస్తులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించాడు. ఇతర సంస్థలు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో ఈ సంస్థ వివరిస్తుంది.
తన 6వ ఏటనే తండ్రి వెళ్లే వ్యాపార సమావేశాల్లో పాల్గొనడం ద్వారా పారిశ్రామిక రంగంపై ఆసక్తి పెంచుకున్న జైనమ్, 13 ఏళ్లకే పదో తరగతి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు.
చిన్న వయసులోనే అసాధారణ విజయాలను అందుకుంటున్న జైనమ్, ఇప్పటివరకు 2 పేటెంట్లను (కాపీరైట్స్) పొందగా, మరో 3 పేటెంట్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. ‘టెడ్-ఎక్స్’ (TEDx) వేదికపై ప్రసంగించడంతో పాటు, ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. తన యూట్యూబ్ ఛానల్లో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న అతను, గత కొన్నేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తనను తాను నిరంతరం మెరుగుపరుచుకుంటున్నాడు.
కృషి, సరైన ప్రణాళిక ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఈ యువ పారిశ్రామికవేత్త ప్రయాణం, సోషల్ మీడియాలో ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
