అమెరికాలో సొంతంగా ఒక ఇల్లు కొనాలనేది చాలా మంది కల కావచ్చు. కానీ, అక్కడ ఇల్లు కొనడంతోనే పని అయిపోదు; ఆ దేశంలోని కఠినమైన గృహ నిబంధనలను కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ఈ విషయం తెలియని ఒక భారతీయ కుటుంబానికి, వారు కొన్న కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకల సమయంలో ఎదురైన ఒక చేదు అనుభవం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది.
అమెరికాలోని చికాగో నగరంలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ కుంజన్ దేవరా అనే మహిళ ఈ షాకింగ్ ఘటనను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. ఆమె చికాగోలో ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేసి, దానికి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి, ఇంటి వెలుపలి భాగాన్ని రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేశారు. కానీ, ఆ సంతోషం ఎంతో కాలం నిలవకముందే.. ఇంటి బయటి అలంకరణలను వెంటనే తొలగించాలని కోరుతూ ఆమెకు ఒక అధికారిక నోటీసు అందింది.
భారతదేశంలో పండగల సీజన్లలో, శుభకార్యాల సమయంలో ఇళ్లను తమకు నచ్చినట్లుగా అలంకరించుకోవడం ఆనవాయితీ. కానీ, అమెరికాలోని చాలా నివాస ప్రాంతాలలో ‘హోమ్ ఓనర్స్ అసోసియేషన్’ (HOA) అనే సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ నిబంధనల ప్రకారం.. ఇంటి వెలుపలి అలంకరణలను నిర్ణీత సమయానికి మించి ఉంచడానికి అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు. ఈ HOA సంస్థ సదరు ప్రాంతం యొక్క పరిశుభ్రత, అందం మరియు క్రమశిక్షణను కాపాడటానికి నెలవారీగా సుమారు 300 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹29,000) రుసుముగా వసూలు చేస్తుంది.
ఈ నిధుల ద్వారా లాన్ నిర్వహణ, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం మరియు శీతాకాలంలో మంచును తొలగించడం వంటి పనులను ఆ సంస్థ చేస్తుంది. కుంజన్ పంచుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా విస్తరిస్తోంది. పలువురు భారతీయులు దీనిపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ, “విదేశాలకు వలస వెళ్లేటప్పుడు అక్కడ ఉండే స్థానిక చట్టాలు, నిబంధనలను ముందే తెలుసుకోవడం అనవసరమైన జరిమానాల నుండి మనల్ని కాపాడుతుంది” అని కామెంట్లు పెడుతున్నారు.
