ఇకపై ఏఐతో మాట్లాడేటప్పుడు మనిషితో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది! ముఖకవళికలతో సమాధానం చెప్పే కొత్త ఫీచర్.. మెటా తదుపరి సంచలనం.!!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న మెటా సంస్థ, తాజాగా తన ‘మ్యూజ్’ ఏఐ అసిస్టెంట్‌కు ‘మ్యూజ్ వాయిస్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

దీని ద్వారా వినియోగదారులు తమ ప్రశ్నలను టైప్ చేయకుండా, నేరుగా వాయిస్ ద్వారానే ఏఐ అసిస్టెంట్‌తో రియల్ టైమ్‌లో సంభాషించవచ్చు. ఈ ఫీచర్‌ను మొబైల్, వెబ్‌సైట్, మ్యాక్ కంప్యూటర్లలో అందుబాటులోకి తెచ్చారు.

ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. వినియోగదారులు మాట్లాడుతున్నప్పుడు మ్యూజ్ ఏఐ అసిస్టెంట్ అవతార్ ముఖకవళికలు, శరీర కదలికలతో సమాధానమిస్తుంది. వినియోగదారులు కావాలనుకుంటే వాయిస్ మాత్రమే వినబడేలా, అవతార్‌ను స్క్రీన్‌పై చూపించేలా లేదా ఫుల్ స్క్రీన్‌లో ముఖాముఖి మాట్లాడుతున్న అనుభూతిని పొందేలా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, వందలాది వాయిస్ స్టైల్స్‌లో తమకు నచ్చినదాన్ని ఎంచుకునే అవకాశం కూడా కల్పించారు.

మ్యూజ్ వాయిస్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను అడగడమే కాకుండా, కొత్త ఐడియాలను సృష్టించడం, ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం, జాబ్ ఇంటర్వ్యూలకు సిద్ధం కావడం వంటి వాటిలో కూడా సహాయం పొందవచ్చు. ఏఐ సమాధానం చెబుతున్నప్పుడే మధ్యలో యూజర్లు అడ్డుకుని మాట్లాడొచ్చు. దీంతో సాధారణ ప్రశ్న-సమాధానాల పద్ధతికి భిన్నంగా, సహజమైన సంభాషణ అనుభూతిని పొందవచ్చని మెటా తెలిపింది.

ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను తొలి దశలో అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇతర దేశాలకు ఎప్పుడు విస్తరిస్తారనే దానిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. అలాగే, మెటాకు చెందిన ఏఐ గ్లాసెస్, త్వరలో రానున్న ‘మ్యూజ్ చార్మ్’ పరికరంలో కూడా ఈ వాయిస్ కన్వర్జేషన్ ఫీచర్‌ను అందించాలని సంస్థ యోచిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *