“ఇకపై గర్భం దాల్చడం అసాధ్యం”.. క్యాన్సర్ తర్వాత డాక్టర్ చెప్పిన నిజం.. 42 ఏళ్ల వయసులో జరిగిన అద్భుతం.. నెలసరి ఆగిపోయిన తర్వాత కడుపులో పెరిగిన శిశువు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. అమ్మమ్మ అని పిలుస్తున్న జనం.. ఇలాంటి ఘటన కూడా జరుగుతుందా..?

ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ (Belfast) నగరానికి చెందిన 52 ఏళ్ల మిచెల్ రాక్ (Michelle Rock) అనే మహిళ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

రోజూ తన 9 ఏళ్ల కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్తున్నప్పుడు, ఆమెను చూసిన వారంతా “పాపకు మీరు అమ్మమ్మనా?” అనే అడుగుతుంటారు. కానీ, ఆ పసిబిడ్డకు జన్మనివ్వడానికి మిచెల్ దాటుకుని వచ్చిన ప్రయాణం ఎంత పెద్ద అద్భుతమో వారెవరికీ తెలియదు!

వైద్య ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన మిచెల్ నిజ జీవిత కథ ఏమిటో చూద్దాం. తన 40వ ఏట మిచెల్ ‘హా కిన్స్ లింఫోమా’ (Hodgkin’s Lymphoma) అనే ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. అసలు ప్రాణాలతో బయటపడటమే కష్టమనుకున్న స్థితిలో, వరుసగా 6 నెలల పాటు కఠినమైన ‘కీమోథెరపీ’ చికిత్స తీసుకున్నారు. 2015 జూన్‌లో క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ మరియు వయసు కారణంగా జీవితంలో ఇకపై ఆమె గర్భం దాల్చడం అసాధ్యమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో మిచెల్ కూడా తన రాత ఇంతేనని బాధపడుతూ పిల్లల మీద ఆశలు వదులుకున్నారు.

చికిత్స పూర్తయిన ఏడాది తర్వాత, 2016 నవంబర్‌లో మిచెల్‌కు నెలసరి (పీరియడ్స్) పూర్తిగా ఆగిపోయింది. శరీరం కూడా లావెక్కడం మొదలైంది. అప్పటికే తనకు 42 ఏళ్లు రావడంతో, తాను ‘ఎర్లీ మెనోపాజ్’ (నెలసరి శాశ్వతంగా నిలిచిపోయే దశ)కు చేరుకున్నానని ఆమె భావించారు.

రోజులు గడిచేకొద్దీ కడుపులో ఏదో కదలికలు, ఒక్కసారిగా తన్నినట్లుగా అనిపించడం మొదలైంది. అయితే అది కడుపులో ఎలర్జీ లేదా గ్యాస్ సమస్య అని మిచెల్ అనుకున్నారు. స్నానం చేసేటప్పుడు బొడ్డు ఆకారం మారిపోయి, పొట్ట పెద్దదిగా కనిపించినప్పటికీ.. అది క్యాన్సర్ చికిత్స తాలూకు సైడ్ ఎఫెక్ట్ అనే నమ్మారు. చుట్టుపక్కల వారు “మీరు గర్భవతిగా ఉన్నారా?” అని అడిగినప్పుడు కూడా, “నాకు అసలు పిల్లలే పుట్టరు” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చేవారు.

కానీ, సాధారణ రక్తపోటు (BP) పరీక్షల కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడే ఆ ఊహించని మలుపు చోటుచేసుకుంది! మిచెల్ పొట్టను చూసిన డాక్టర్‌కు అనుమానం వచ్చి, వెంటనే ‘అల్ట్రాసౌండ్’ స్కానర్‌ను ఆమె పొట్టపై పెట్టారు. మరుక్షణం… ఆ గదిలోని స్పీకర్‌లో ‘లబ్.. డబ్..’ అంటూ వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు గట్టిగా వినిపించింది!

ఆ శబ్దం విని డాక్టర్ షాక్ అయ్యారు. మిచెల్ ఎలాంటి వ్యాధితోనూ బాధపడటం లేదు; పైగా ఆమె కడుపులో 33 వారాల (అంటే దాదాపు 8 నెలల) ఆరోగ్యకరమైన శిశువు పెరుగుతోంది! ఈ విషయం విన్న మిచెల్‌కు ఒక్కసారిగా తల తిరిగినంత పనైంది.

33వ వారంలో గర్భం ఉన్నట్లు తెలియడంతో, ప్రసవానికి సిద్ధం కావడానికి మిచెల్‌కు కేవలం 6 వారాల సమయం మాత్రమే ఉండేది. తల్లిగా ఎలాంటి అనుభవం గానీ, పాపకు అవసరమైన వస్తువులు గానీ ఆమె దగ్గర లేవు. విషయం తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు తరలివచ్చి.. రెండు కార్ల నిండా పాపకు కావాల్సిన బట్టలు, ఉయ్యాల, డైపర్లు (న్యాపీలు) ఇలా అన్ని వస్తువులను కొని తెచ్చి పెట్టారు.

గర్భం ఉన్నట్లు తెలిసిన సరిగ్గా 31వ రోజున మిచెల్‌కు ఉమ్మనీరు పగిలి, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి ‘రైలీ’ (Ryleigh) అని పేరు పెట్టారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా 42 ఏళ్ల వయసులో అనూహ్య రీతిలో తల్లయిన మిచెల్, నేడు 52 ఏళ్ల వయసులో తన 9 ఏళ్ల కుమార్తెను ఒంటరిగా పోరాడుతూ పెంచుతున్నారు. “నేను ఆమెకు అమ్మమ్మను కాదు, అమ్మను!” అని గర్వంగా చెప్పే మిచెల్ కథ.. ఆశ, నమ్మకమే జీవితం అనే సత్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *