చైనాలోని షెన్‌జెన్ (Shenzhen) నగరానికి చెందిన ఒక తండ్రి, ఎప్పుడూ టీవీకే అతుక్కుపోయే తన కొడుకును చదివించడానికి ఒక విభిన్నమైన ప్రయత్నం చేశాడు.
టీవీ చూడటాన్ని పూర్తిగా ఆపకుండా, దాన్ని చదువుతో అనుసంధానం చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సహాయంతో ఒక కొత్త విధానాన్ని రూపొందించాడు. దీని ప్రకారం, కొడుకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చదువుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెబితేనే టీవీ చూడటం కొనసాగించగలడు.
వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆ తండ్రి కొడుకు, ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. కొడుకు చదువు కంటే టీవీ చూసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఆ తండ్రి ఆందోళన చెందాడు. మొదట టీవీలో ఉన్న సాధారణ ప్రశ్న-జవాబుల ఫీచర్‌ను ఉపయోగించి చూశాడు. కానీ, కొడుకు దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని ఇట్టే కనిపెట్టేశాడు. ఆ తర్వాత, నిర్ణీత సమయానికి కరెంట్ కట్ అయ్యేలా ఒక పరికరాన్ని అమర్చాడు. కొడుకు దాన్ని కూడా పని చేయకుండా చేయడంతో తండ్రి ప్రయత్నం విఫలమైంది.
దీంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ సహాయం తీసుకున్న తండ్రి.. టీవీ చూస్తున్నప్పుడు కొడుకును పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేలా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. దీని ప్రకారం, టీవీలో కార్యక్రమం చూడటం ప్రారంభించిన 10 నిమిషాల తర్వాత తెరపై ఒక ప్రశ్న ప్రత్యక్షమవుతుంది. చైనీస్, మ్యాథ్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల నుంచి అతని పాఠశాల సిలబస్‌కు తగిన ప్రశ్నలు అడుగుతుంది. తప్పు సమాధానం ఇస్తే మళ్లీ ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సరైన సమాధానం ఇచ్చే వరకు టీవీ కార్యక్రమం ముందుకు సాగదు.
ఈ కొత్త విధానం వల్ల కొడుకు కోపగించుకుంటాడని భావించిన తండ్రికి ఆశ్చర్యం ఎదురైంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో కొడుకు ఆసక్తి చూపడం ప్రారంభించాడట. ప్రస్తుతం ప్రశ్నల స్థాయిని (కఠినతను) పెంచి, ఈ విధానాన్ని మరింత మెరుగుపరచాలని తండ్రి ప్లాన్ చేస్తున్నాడు. కొడుకు ఈ సిస్టమ్‌ను ఏమార్చడానికి కొత్త మార్గాలను కనిపెట్టడం, తండ్రి అందులోని లోపాలను సరిదిద్దడం ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ఒక ఆటలా మారిపోయింది. టీవీని పూర్తిగా బ్యాన్ చేయకుండా, వినోదంతో పాటు చదువును మేళవించిన ఆ తండ్రి ప్రయత్నాన్ని ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా ప్రశంసిస్తున్నారు.

Leave a Reply