కెనడాలోని బ్రాంప్టన్ (Brampton) నగరంలో సాయంత్రం వేళ వాకింగ్‌కు (నడకకు) వెళ్లిన 78 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేసి, 20,000 డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 12 లక్షలకు పైగా) విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
చింగుఅకౌసీ రోడ్ (Chinguacousy Road), బోవెర్డ్ డ్రైవ్ వెస్ట్ (Bovaird Drive West) ప్రాంతానికి సమీపంలో జూలై 28వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది.
బాధిత వృద్ధురాలి కుమారుడు రాఘవేంద్ర కుమార్ ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. కారులో వచ్చిన ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడని, కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు నటిస్తూ కౌగిలించుకుని మోసం చేశాడని తెలిపారు.
ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, మెడలో ఉన్న అసలైన బంగారు గొలుసు, చేతి గాజులను చాకచక్యంగా లాగేసుకున్నారు. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను తొడిగి అక్కడి నుంచి కారులో పరారయ్యారు.
ఆ ఆభరణాలు కేవలం ఖరీదైనవి మాత్రమే కాదని, 1971లో వివాహ సమయంలో ఆమె భర్త కానుకగా ఇచ్చినవని, వాటితో ఎన్నో భావోద్వేగ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చోరీ ఘటనతో వృద్ధురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చి నడవడానికి కూడా భయపడుతున్నారని ఆమె కుమారుడు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయింది. నిందితులు ఉపయోగించిన తెల్ల రంగు ‘షెవర్లే ఈక్వినాక్స్’ (Chevrolet Equinox) కారును అనుమానాస్పద వాహనంగా గుర్తించిన పోలీసులు, తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
కెనడాలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల ఇటువంటి వినూత్న చోరీలు (distraction thefts) పెరుగుతుండటంతో, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హெచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే బ్రాంప్టన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

Leave a Reply