ఒక ప్రముఖ ప్రీ-స్కూల్లో కేవలం 23 నెలల వయసున్న పసి బాలుడిపై పాఠశాల యాజమాన్యం మరియు సిబ్బంది చూపిన తీవ్ర నిర్లక్ష్యం కారణంగా.. ఆ చిన్నారి శారీరకంగా, మానసికంగా తీవ్రంగా గాయపడిన ఘటన ఒంటిని గగుర్పొడిచేలా చేస్తోంది.
వృత్తిరీత్యా న్యాయవాది (అడ్వకేట్) అయిన సదరు బాలుడి తండ్రి.. ఉదయం ఎప్పటిలాగే తన బాబును ప్రీ-స్కూల్లో విడిచిపెట్టి వెళ్లారు. అయితే, క్లాస్‌రూమ్‌లో టీచర్ లేని సమయంలో.. అక్కడున్న కేర్‌టేకర్ (ఆయా) పిల్లలను గదిలోనే ఉంచి, బయట నుండి తాళం వేసి వెళ్ళిపోయింది.
అర గంట పాటు పసికందు నరకయాతన:
టీచర్, ఆయా ఎవరూ లేకపోవడంతో గదిలో ఉన్న చిన్న పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పిల్లల మధ్య జరిగిన ఘర్షణలో.. తోటి పిల్లలు ఆ 23 నెలల బాలుడి ముఖం, పెదవులు, ఛాతీ మరియు కాళ్లపై విచక్షణారహితంగా కొరకడమే కాకుండా గోళ్లతో గిచ్చారు. దీనితో ఆ చిన్నారి ఒళ్లంతా తీవ్రమైన గాయాలయ్యాయి. దాదాపు అరగంట పాటు ఆ పసికందు నొప్పితో గట్టిగా ఏడుస్తున్నా, కిటికీ గుండా చూసిన స్కూల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు సరే కదా.. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు.
తల్లిదండ్రులతో స్కూల్ యాజమాన్యం అహంకారం:
మధ్యాహ్నం బాబును ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో.. ఏదో చిన్న దెబ్బ తగిలిందంటూ స్కూల్ సిబ్బంది అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూశారు. అంతేకాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు వీలుగా కొంత నష్టపరిహారం ఇస్తామని ఆశ చూపారు. ఒకవేళ కేసు పెట్టినా తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ ఎంతో అహంకారంగా మాట్లాడారు. జరిగిన ఘోరాన్ని నిర్ధారించుకోవడానికి తల్లిదండ్రులు సీసీటీవీ (CCTV) ఫుటేజీలను చూపించాల్సిందిగా డిమాండ్ చేయగా, స్కూల్ యాజమాన్యం వాటిని చూపించకుండా దాచిపెట్టింది.
ఆరుగురిపై కేసు నమోదు – పోలీసుల విచారణ:
ప్రస్తుతం ఆ చిన్నారి లోపలి గాయాల (Internal Injuries) నిమిత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. బాధితుడి తండ్రి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు స్పందించిన సిడ్కో ఎం.ఐ.డి.సి (CIDCO MIDC) పోలీసులు.. సదరు ప్రీ-స్కూల్ సీఈఓ (CEO), ప్రిన్సిపాల్, కేర్‌టేకర్ సహా మొత్తం ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
