నటుడు ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అభిమాన సంఘం నాయకులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన నేపథ్యంలో, ధనుష్ అభిమానులు కూడా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం, ప్రజలను నేరుగా కలవడం వంటి చర్యలను ముమ్మరం చేశారు. తిరువణ్ణామలై షూటింగ్ లొకేషన్లో ధనుష్ నిరంతరం తన అభిమానులతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా, విద్యా సంబంధిత సహాయ కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వార్డుల వారీగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుల చేరికలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీని కొనసాగింపుగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ధనుష్ అభిమాన సంఘ నిర్వాహకులను స్వతంత్రంగా పోటీ చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. పోటీ చేయాలనుకునే నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చని, ప్రచార సమయంలో ధనుష్ ఫోటో, జెండాను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభిమానులకు ధనుష్ తరఫు నుంచి అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందుతుందని ప్రచారం సాగుతుండటంతో, తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply