గౌహతి: అస్సాం రాష్ట్రంలో ఇకపై 18 ఏళ్లు పైబడిన వారికి కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయబోమని అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన వారు ఆధార్ కార్డులు పొందకుండా నిరోధించేందుకే ఈ కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం హిమంత బిస్వ శర్మ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అస్సాంలోకి అక్రమ వలసలను అడ్డుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ చర్చల అనంతరం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం, రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీని నిలిపివేయాలని నిర్ణయించారు. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులు సులభంగా ఆధార్ కార్డులు పొందుతున్నారని, దీనిని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. ”18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయకూడదని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. అక్రమంగా దేశంలోకి చొరబడిన బంగ్లాదేశీయులకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆధార్ కార్డు లభించకుండా చూసేందుకే ఈ చర్యలు చేపట్టాము.
అదే సమయంలో, షెడ్యూల్డ్ తెగలు (ST), షెడ్యూల్డ్ కులాలు (SC) మరియు తేయాకు తోటల కార్మికులకు (Tea Garden Workers) మార్చి 2027 వరకు ఆధార్ కార్డులు జారీ చేయబడతాయి. 2027 ఏప్రిల్ 1 నుండి ఈ నిషేధం పూర్తిగా అమలులోకి వస్తుంది. ఆ తర్వాత తేయాకు తోటలు మరియు గిరిజన వర్గాలకు చెందిన 18 ఏళ్లు పైబడిన వారికి కూడా ఆధార్ కార్డుల జారీ నిలిపివేయబడుతుంది.
అయినప్పటికీ, కొన్ని అనివార్యమైన అసాధారణ పరిస్థితుల్లో ఎవరికైనా ఆధార్ కార్డు అవసరమైతే, వారు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సదరు దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, వారు అర్హులని తేలితేనే ఆధార్ కార్డు మంజూరు చేస్తుంది. కాగా, 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు మాత్రం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది” అని ఆయన వివరించారు.

Leave a Reply