నటుడు విజయ్ మరియు నటి త్రిష మధ్య ఉన్న స్నేహం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న అనవసర ప్రచారాన్ని నటి షకీలా తీవ్రంగా ఖండించారు. “ఒక ఆడ, మగా మంచి స్నేహితులుగా ఉండకూడదా? ఒక మంచి స్నేహాన్ని ఎందుకు ఇలా కించపరుస్తున్నారు?” అని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు.
ఇటీవల ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒక పెళ్లి వేడుకకు వారిద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించి వెళ్లడాన్ని కూడా విమర్శించడం చూస్తుంటే, మనం ఏ కాలంలో ఉన్నామో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
విజయ్ రాజకీయ రంగప్రవేశంపై మద్దతు: విజయ్ రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా అనేక అడ్డంకులు సృష్టిస్తుండటం పట్ల షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక మనిషిని ఇంకెంత కాలం ఇబ్బంది పెడతారు?” అని ప్రశ్నించిన ఆమె, తన స్టార్ హోదాను పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయడానికి విజయ్ ముందుకు రావడం సామాన్యమైన విషయం కాదని ప్రశంసించారు. “ఇక్కడ ఎవరు ఉత్తములు? ఎంతమంది రాముడిలా బతుకుతున్నారు?” అని అడిగిన షకీలా, ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని వారి ప్రజా జీవితాన్ని అంచనా వేయడం ముమ్మాటికీ తప్పని స్పష్టం చేశారు.
కుటుంబ జీవితంపై విమర్శలకు చెక్: నటుల కుటుంబ జీవితాన్ని విమర్శించే వారికి కూడా షకీలా గట్టి బదులిచ్చారు. “భార్యాపిల్లలను చూసుకోలేని వాడు దేశాన్ని ఎలా చూసుకుంటాడు?” అని విజయ్ను ఉద్దేశించి చేస్తున్న విమర్శలు అనవసరమని ఆమె అన్నారు. గతంలో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి మాటలే వినిపించాయని ఆమె గుర్తు చేశారు. వారి ఇల్లు, కుటుంబం అనేది వారి వ్యక్తిగత విషయం; ఒక నాయకుడిగా వారు దేశానికి ఏం చేయబోతున్నారనే దానిపై మాత్రమే ప్రజలు దృష్టి సారించాలని షకీలా ఆ ఇంటర్వ్యూలో నొక్కి చెప్పారు.
