ఇక చైనాకు తెలియకుండా అణువంతైనా కదలదు.. భవిష్యత్తును ఊహించే ఏఐ సాఫ్ట్‌వేర్.. భయంకరమైన విశ్లేషణ!

ప్రముఖ హాలీవుడ్ చిత్రం ‘కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్’ కథలో ‘హైడ్రా’ అనే వ్యవస్థ ఒక రహస్య అల్గారిథమ్‌ను రూపొందిస్తుంది. అది ప్రజల డిజిటల్ చరిత్రను విశ్లేషించి, భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుతారో ముందే ఊహిస్తుంది. ఇప్పుడు ఆ సైన్స్ ఫిక్షన్ చైనా ద్వారా నిజమైంది. చైనాకు చెందిన ఒక టెక్ సంస్థ, ఏఐ (AI) ద్వారా పనిచేసే అత్యాధునిక పర్యవేక్షణ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది.

చైనా సాంకేతిక వృద్ధి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసినా, దాని వెనుక ఉన్న పర్యవేక్షణ చర్యలు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. ‘క్యూడ్జ్’ (Geedge) అనే చైనా సంస్థ రూపొందించిన ఈ సాంకేతికత అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది.

భవిష్యత్తును ఊహించే శక్తి: ఇది సాధారణ పర్యవేక్షణ సాధనం కాదు. ఒక వ్యక్తి భవిష్యత్తులో నిరసనల్లో పాల్గొంటాడా లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాడా అన్నది ఇది ముందే ఊహించి హెచ్చరిస్తుంది. ఈ సాంకేతికత ఒక వ్యక్తి యొక్క రోజువారీ కార్యకలాపాలను, అలవాట్లను అత్యంత నిశితంగా గమనిస్తుంది. ఒక వ్యక్తి షాపింగ్ పద్ధతులు, సోషల్ మీడియా పోస్టులు, వెళ్లే ప్రదేశాలు, కలిసే వ్యక్తులు వంటి డేటాను ఏఐ అల్గారిథమ్ విశ్లేషిస్తుంది. తద్వారా వారి భవిష్యత్తు చర్యలను అంచనా వేస్తుంది. ముఖ్యంగా నిరసనలు జరిగే చోటికి తరచుగా వెళ్లేవారిని లేదా ప్రభుత్వానికి వ్యతిరేక అభిప్రాయాలు పంచుకునేవారిని ఈ టూల్ లక్ష్యంగా చేసుకుంటుంది. వారు ఎప్పుడు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతారో భద్రతా సంస్థలకు ఈ సాఫ్ట్‌వేర్ రహస్యంగా సమాచారం అందిస్తుంది.

ఏఐ కెమెరాలు: చైనాలో ఇప్పటికే ముఖ గుర్తింపు (Face Recognition) కోసం ఏఐ కెమెరాలు పనిచేస్తున్నాయి. అయితే, ఈ కొత్త ఏఐ సాంకేతికత వాటిని దాటి మరో స్థాయికి చేరుకుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్ద ముప్పుగా పరిగణించబడుతోంది. నేరం చేయకముందే ఒకరిని నేరస్తుడిగా పరిగణించే ధోరణి పెరుగుతుందని మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ముఖాన్ని మాత్రమే కాకుండా, ప్రజల ‘బిహేవియరల్ పాటర్న్’ (ప్రవర్తనా సరళి)ను ఇది ఖచ్చితంగా విశ్లేషిస్తుంది.

అంతా ఊహించే సాఫ్ట్‌వేర్: వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ బ్రెట్ వి. బెన్సన్ ఈ విషయంపై సంచలన విషయాలు వెల్లడించారు. క్యూడ్జ్ సంస్థ కేవలం సమాచారాన్ని సేకరించడం లేదని, ఒక పౌరుడు తర్వాత ఏం చేస్తాడో, ఎవరితో కలుస్తాడో ముందే ప్లాన్ చేసి ఒక మ్యాప్‌ను రూపొందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక ప్రొఫైల్‌ను ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ తయారు చేస్తుంది. మీరు ఎవరు, మీ తదుపరి అడుగు ఏంటనేది కంప్యూటర్ నిర్ణయిస్తుంది.

అమెరికా ప్రభావం: అమెరికా విధించిన చిప్ ఎగుమతుల ఆంక్షల వల్ల ఈ పరిశోధనలు కొంత మందగించాయి. అత్యాధునిక ఏఐ చిప్‌లను అందించకుండా అమెరికా ఆంక్షలు విధించడంతో ఎన్విడియా (Nvidia) వంటి సంస్థల చిప్‌లు చైనాకు అందలేదు. అయితే, అమెరికా రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఇప్పుడు చైనాకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఎన్విడియా యొక్క అధునాతన చిప్‌లు ఇకపై చైనాకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో, చైనా యొక్క ఏఐ నిఘా సాంకేతికత మరింత బలపడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


Posted

in

by

Tags: