మధ్యప్రాచ్యం: ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికా తన ఆయుధ నిల్వల పరంగా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ‘ద వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం, ఇజ్రాయెల్‌ను రక్షించే క్రమంలో అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు భారీగా తగ్గిపోయాయని పెంటగాన్ అధికారులు అంగీకరించారు. ఈ పరిణామం ఆసియా, యూరప్‌లలో అమెరికా రక్షణ సామర్థ్యంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అమెరికా ప్రయోగించిన 300కు పైగా అడ్వాన్స్‌డ్ మిస్సైల్స్: అమెరికా రక్షణ శాఖ నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ ఆకాశాన్ని రక్షించేందుకు అమెరికా తన వద్ద ఉన్న 200లకు పైగా ‘THAAD’ (Terminal High Altitude Area Defense) ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది. ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలాయి. వీటి ఉత్పత్తి వేగం కూడా చాలా తక్కువగా ఉండటంతో కొత్త వాటిని తయారు చేయడం కష్టమవుతోంది. అంతేకాకుండా, మధ్యధరా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధనౌకల నుండి 100కు పైగా SM-3 మరియు SM-6 ఇంటర్సెప్టర్లను ప్రయోగించారు. మొత్తంగా ఇజ్రాయెల్ కంటే అమెరికాయే 120 ఇంటర్సెప్టర్లను ఎక్కువగా ప్రయోగించి, ఇరాన్ క్షిపణులను గాలిలోనే నాశనం చేసింది.
ఇజ్రాయెల్ వ్యూహం.. భారమంతా అమెరికాపైనే! యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ తెలివిగా తన సొంత ఆయుధ నిల్వలను కాపాడుకుంటూ, రక్షణ బాధ్యతను అమెరికాపై నెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తన ‘ఏరో’ (Arrow) ఇంటర్సెప్టర్లలో 100 కంటే తక్కువగా, ‘డేవిడ్స్ స్లింగ్’ (David’s Sling) మిస్సైల్స్ సుమారు 90 మాత్రమే వాడాయి. స్టిమ్సన్ సెంటర్ ఫెలో కెల్లీ గ్రీకో మాట్లాడుతూ, “ఈ గణాంకాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అమెరికా వద్ద ఇప్పుడు స్టాక్ చాలా పరిమితంగా ఉంది” అని హెచ్చరించారు.
ఆందోళనలో జపాన్, దక్షిణ కొరియా: అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గడం ఆసియాలోని మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాలకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. చైనా మరియు ఉత్తర కొరియా ముప్పును ఎదుర్కొనేందుకు ఈ దేశాలు పూర్తిగా అమెరికా రక్షణపైనే ఆధారపడి ఉన్నాయి. ఆసియాలో ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే, అమెరికా తక్షణమే ఆయుధాలను పంపించలేదేమోనన్న భయం ఆ దేశాల్లో నెలకొంది.
ట్రంప్ హెచ్చరిక: మరోవైపు, ఇరాన్‌కు అణు ఆయుధాలు ఉండకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. “హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ రవాణాకు పూర్తిగా అందుబాటులో ఉండాలి. అమెరికన్ నేవీ సమర్థవంతంగా పనిచేస్తోంది, మా అనుమతి లేకుండా ఏ నౌకా ఇరాన్‌లోకి వెళ్లలేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ట్రంప్ ఇరాన్‌పై మరో పెద్ద సైనిక చర్య చేపట్టాలని నిర్ణయించుకుంటే, అప్పటికే నిండుకున్న ఆయుధ నిల్వలు పెను సంక్షోభానికి దారితీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
