ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. చర్చల ద్వారా శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, పరస్పరం దాడులు మాత్రం ఆగడం లేదు. ఆదివారం ఇరాన్ వేసిన మిసైల్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఒక కెమికల్ ప్లాంట్‌పై పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ దాడి కారణంగా ప్లాంట్ నుండి విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనికి ప్రతికారంగా ఇజ్రాయెల్ ఆదివారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది.
చైనా కంపెనీకి చెందిన ప్లాంట్‌పై దాడి: చైనా యాజమాన్యంలోని ‘సింజెంటా గ్రూప్’లో భాగమైన ADAMA కంపెనీకి చెందిన ‘మక్తేషిమ్ ప్లాంట్’పై ఈ దాడి జరిగింది. అగ్రికల్చర్ కెమికల్స్ తయారు చేసే ఈ ప్లాంట్‌కు జరిగిన నష్టంపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని కంపెనీ తెలిపింది.
ప్రజలకు హెచ్చరిక: నియోత్ హోవావ్ ఇండస్ట్రియల్ ఏరియాలో విషపూరిత రసాయనాలు ఉన్నందున, ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దని ఇజ్రాయెల్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ కోరింది. మంటలను ఆర్పేందుకు 34 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. స్థానిక నివాసితులు కిటికీలు, తలుపులు మూసివేసి ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని ప్రాంతాలపై దాడులు:
- కువైట్: కువైట్‌లోని సైనిక శిబిరంపై ఇరాన్ జరిపిన దాడిలో 10 మంది సైనికులు గాయపడ్డారు. గత 24 గంటల్లో కువైట్ గగనతలంలోకి 14 బాలిస్టిక్ మిసైళ్లు, 12 డ్రోన్లు వచ్చాయి.
- ఇరాన్ వర్సిటీపై దాడి: ఇరాన్‌లోని ఇస్ఫహాన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతికారంగా అమెరికా, ఇజ్రాయెల్ వర్సిటీలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
- యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై ఇరాన్ 16 బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది. అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
- బందర్-ఎ-ఖమీర్: ఇరాన్‌లోని ఈ ఓడరేవు నగరంపై జరిగిన దాడిలో ఐదుగురు మరణించారు.
- అల్యూమినియం ప్లాంట్లు: బహ్రెయిన్ మరియు యూఏఈలోని ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం ప్లాంట్లపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు.
