వాషింగ్టన్/బీరుట్: సుదీర్ఘ కాలంగా రగులుతున్న ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఎట్టకేలకు యుద్ధ మేఘాలు తొలగి శాంతి కిరణాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇరు దేశాల మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఏప్రిల్ 16, 2026 నుండి అమలులోకి వచ్చిన ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన పూర్తి పాఠాన్ని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసింది.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవే:
- యుద్ధానికి స్వస్తి – శాంతికి నాంది:
ఇరు దేశాలు తాము ఇకపై ‘యుద్ధంలో లేము’ అని స్పష్టంగా ప్రకటించాయి. శాశ్వత శాంతి ఒప్పందం దిశగా నేరుగా చర్చలు జరిపేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఒకరి సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను మరొకరు గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నారు. - సాయుధ ముఠాలపై ఉక్కుపాదం:
లెబనాన్ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిన ప్రభుత్వేతర సాయుధ ముఠాల (హిజ్బుల్లా వంటివి) కార్యకలాపాలను నియంత్రించాలని నిర్ణయించారు. లెబనాన్‌లో కేవలం అధికారిక భద్రతా దళాలకు (సైన్యం, పోలీస్) మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంటుందని ఒప్పందం స్పష్టం చేసింది. - ఆత్మరక్షణే ఇజ్రాయెల్ కవచం:
కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, తనపై జరిగే దాడుల నుండి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంటుంది. అయితే, లెబనాన్‌లోని పౌర, సైనిక లక్ష్యాలపై ఎలాంటి ముందస్తు దాడులు (Offensive Operations) చేయకూడదని ఇజ్రాయెల్ అంగీకరించింది. - లెబనాన్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత:
హిజ్బుల్లా లేదా ఇతర గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు లెబనాన్ ప్రభుత్వంపై ఉంది. అంతర్జాతీయ సహకారంతో లెబనాన్ సైన్యం తన సరిహద్దులను కాపాడుకోవాలని, ఏ ఇతర దేశం లేదా గ్రూపు లెబనాన్ సార్వభౌమత్వానికి హామీదారుగా ఉండకూడదని ఒప్పందం పేర్కొంది. - పొడిగింపునకు అవకాశం:
ప్రస్తుతానికి ఈ ఒప్పందం 10 రోజుల పాటు (గుడ్‌విల్ జెస్టర్) అమలులో ఉంటుంది. చర్చల్లో పురోగతి కనిపిస్తే, ఇరు దేశాల అంగీకారంతో దీన్ని మరింత కాలం పొడిగించే అవకాశం ఉంది.
34 ఏళ్ల తర్వాత ఇరు దేశాల నేతల సంభాషణ?
ఈ ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి కోసం కొంత సమయం ఇస్తున్నాం. దాదాపు 34 ఏళ్ల తర్వాత ఇరు దేశాల అగ్రనేతలు రేపు నేరుగా మాట్లాడుకోబోతున్నారు” అని సంచలన పోస్ట్ చేశారు. అంతకుముందే వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆధ్వర్యంలో ఇరు దేశాల దౌత్యవేత్తలు ముఖాముఖి భేటీ అయ్యారు.
ప్రస్తుతానికి సరిహద్దుల వద్ద తుపాకుల మోత తగ్గినప్పటికీ, వివాదాస్పద భూభాగాల సరిహద్దు గుర్తింపు వంటి కీలక అంశాలపై చర్చలు సవాలుగా మారనున్నాయి. అమెరికా పర్యవేక్షణలో జరగనున్న ఈ చర్చలు మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని తీసుకువస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.
